విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా.. 21న రౌండ్ టేబుల్, 25న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- వామపక్ష పార్టీల నిర్ణయం
- ప్రజా ఉద్యమాల నిర్బంధంపై ఖండన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వివిధ పేర్లతో ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలను నిరసిస్తూ ఈ నెల 21న విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం , 25వ తేది జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. వామపక్ష పార్టీల సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం విజయవాడలోని బాలోత్సవం భవనంలో జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు పోలారి, సిపిఐఎంఎల్‌లిబరేషన్ రాష్ట్ర నాయకులు హరినాధ్, ఎంసిపిఐయు(యు) నాయకులు ఖాదర్‌బాషా, ఎస్‌కె ఆజాద్ హాజరయ్యారు. సిపిఐ(యంఎల్), యస్‌యుసిఐ(సి), ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్‌ఎస్‌పి ఈ తీర్మానానికి తమ ఆమోదం తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిందని ట్రూఅప్, సర్దుబాటు ఛార్జీలు, శ్లాబులు మార్చడం పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపిందని ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, కొన్ని పరిశ్రమలు మూతపడుతున్నాయని, వ్యాపారాలు దెబ్బతిని, ఉపాధి తగ్గుతోందని, డిస్కమ్స్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిపై వడ్డీ కూడా ప్రజల నెత్తిన రుద్దుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఇళ్లకు, షాపులకు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారని, ప్రతి కనెక్షన్‌కు రూ. 13,000 భారం పడనుందని తెలిపారు. స్మార్ట్ మీటర్ల వల్ల డిమాండ్‌ను బట్టి గంటకు ఒక్కోరేటు పెట్టి వసూలు చేస్తారని, ఈ రూపంలో ప్రజలపై విపరీత భారాలు పడతాయని అన్నారు. ఇప్పటికే మోపుతున్న భారాలనూ సమావేశం ఖండించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్‌మీటర్లు తదితర అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిర్భంధానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు, ప్రముఖ వ్యక్తులతో సెప్టెంబరు 21న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరపాలని సమావేశం నిర్ణయించింది. సెప్టెంబరు 25న అన్ని జిల్లా కలక్టరేట్ల వద్ద, విజయవాడలో ధర్నాచౌక్‌లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు పాల్గొని కరెంటు ఛార్జీలపై ప్రతిఘటనోద్యమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రజానీకానికి వామపక్షపార్టీలు విజ్ఞప్తి చేశాయి.
నిర్భంధంపై తీవ్ర ఖండన
రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు ప్రజలపై భారాలు వేస్తూ మరోవైపు ప్రజల నుండి వస్తున్న అసంతృప్తిని అణిచివేయటానికి నిర్భంధానికి పూనుకుంటోందని, ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతోందని సమావేశం విమర్శించింది. ప్రజలు, కష్టజీవులు, కార్మికులు నిరసన తెలియజేయడానికీ అవకాశం లేకుండా చేస్తోందని, ప్రదర్శనలకు, ధర్నాలకు కూడా అనుమతివ్వడం లేదని తెలిపింది. హాలు మీటింగుకు కూడా అనుమతులు తీసుకోవాలని నిబంధనలు పెడుతోందని, ప్రజాస్వామ్య, పౌర హక్కులను కాలరాచే కేంద్ర బిజెపి బాటలో వైసిపి పయనిస్తోందని, అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు జరగగకుండా భగం చేసిందని తెలిపింది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అరెస్టు చేసిన తీరును ఖండించింది. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్భంధాన్ని ఆపాలని డిమాండ్ చేసింది.