రైతు శ్రమలాగానే పారిశుధ్య శ్రమ కూడా మన దేశంలో విస్మరణకు గురౌతున్నది. ఈ రెండు శ్రమలూ అమూల్యమైనవి. ఒకటి ఆహార భద్రతను కల్పిస్తే మరొకటి ఆరోగ్య భద్రతను కల్పిస్తుంది. పరిశుభ్రత లేకుండా ప్రజారోగ్యం ఉండదు. లక్ష్షల రూపాయల జీతం ఇస్తామన్నా పారిశుధ్యం, సఫాయి పనులకు చాలామంది ముందుకు రారు. ఎందుకంటే ఆ దుర్గంధ దుర్భర పరిస్థితులను భరించడం, వాటి మధ్యన పనిచేయడం కష్టసాధ్యం. స్వతంత్ర భారతావని అమృతోత్సవ వేడుకలు (75 ఏళ్ళు) జరుపుకుంటున్న ఈ తరుణంలో సైతం దేశవ్యాప్తంగా ఇంకా 20 లక్షల మందికి పైగా సఫాయి కార్మికులు మానవ మల మూత్రాలను చేతులతో తట్టలతో ఎత్తి పారబోయడం, మ్యాన్‌హోల్స్‌లో పూర్తిగా దిగబడి మురికిని తొలగించడం ఎంతటి నరకప్రాయమో ఊహించుకోవచ్చు. దీనినే అమానవీయ సఫాయి పని (ఇన్‌హ్యూమన్ స్కావింజర్స్ వర్క్) అని కూడా అంటున్నారు. పాలకుల చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పంతో కూడిన విధివిధానాలే పారిశుధ్య పనికి న్యాయం చేయగలవు తప్ప పైపై నాటకాలు ఎంత ఆడితే మాత్రం ఏం ప్రయోజనముంటుంది?
'స్వచ్ఛ భారత్-స్వాస్థ భారత్' అంటూ ప్రధాని మోడీ మరలా చీపురు పట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మొన్నటికి మొన్న 'స్వచ్ఛత కీ సేవా' కార్యక్రమంలో వినూత్నంగా ఫిట్‌నెస్ ఆరోగ్య సంరక్షణను జతచేశారు. ఇందుకు సంబంధించి ఫిట్‌నెస్ నిపుణుడు అంకిత్ బైయాన్ పూరియాను కలుపుకున్నారు. ప్రధాని పిలుపు మేరకు దేశమంతటా జరిగిన కార్యక్రమంలో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాల్గొన్నట్టు మీడియా తెలిపింది. బస్టాండ్లు, మార్కెట్లు, రహదారులు, జలవనరులు, తీరప్రాంతాలు, బడులు, గుడులు, గోశాలలు వీరు శుభ్రపరిచిన ప్రాంతాలు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన అధికార ప్రచారం 'ఎక్స్'లో ఈ విధంగా షేర్ అయింది. 'నేడు దేశమంతా స్వచ్ఛతపై దృష్టి పెట్టింది. నేను బైయాన్ పూరియా కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నాం. కేవలం పరిసరాలను శుభ్రపరచడమే కాదు. ఫిట్‌నెస్, ఆరోగ్యం కూడా ముఖ్యం. ఇదంతా స్వచ్ఛ భారత్ స్వాస్థ భారత్ కోసమే' అని ప్రధాని ఉధ్ఘాటించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అదే మీడియా తెలిపింది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తలు...ఓV్‌ా ఒకరేమిటి ఇలా ఎంతోమంది రంగంలోకి వచ్చి చీపుర్లకు పని చెప్పారట. ప్రైవేటు కంపెనీలు, ధార్మిక సంస్థలు కూడా ఈ శ్రమదానంలో పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషమని వివరించింది. దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీర్మనించుకున్నదని, ఇదొక సవాలు, సాహసమని, చెత్త రహిత భారత్ అనే కలను సాకారం చేసుకుందామని, క్రికెట్ లీడరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఇందుకు మద్దతు ఇచ్చారనీ...! ఇలా ఇలా ఊదరగొట్టింది. నిజమే. అయితే స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా గాంధీని (చీపురు పట్టుకున్న గాంధీ చిత్రంతో సహా) ఉపయోగించుకుంటున్న బి.జె.పి. పారిశుధ్యం కృషిలో గాంధీ అభిప్రాయాలకు ఏమైనా విలువిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
'మనకు స్వేచ్ఛా భారత్ ఎంత ముఖ్యమో స్వచ్ఛ భారత్ అంతే ముఖ్యం' అని గాంధీజీ నిరంతరం నినదించాడు. పారిశుధ్యం పనిని పుణ్యకార్యంగా భావించాలని తనదైన శైలిలో చెప్పాడు. నమ్మాడు, ఆచరించాడు. స్వహస్తాలతో దొడ్లు శుభ్రపరిచి ఆరాధ్యుడయ్యాడు. స్వాతంత్య్రా నంతరం మన భారత్ పచ్చని ప్రకృతి, పంట పొలాలతో నిత్యం శోభిల్లాలని ఆకాంక్షించాడు.
కారణం ఏదైతేనేం...స్వచ్ఛత వైపు మరో అడుగు అంటూ ప్రధాని అయిన కొత్తలోనే మోడీ 2014 లోనే స్వచ్ఛ భారత్ మిషన్ (క్లీన్ ఇండియా మిషన్) ప్రారంభించారు. ఈ మిషన్ ఓ ప్రతిష్టాత్మక పథకమని కూడా అప్పుడు చెప్పుకొచ్చారు. 2014-19 ఐదేళ్ల కాలంలో 62 వేల కోట్ల రూపాయల నిధులతో నాలుగు వేల పట్టణాలకు పారిశుధ్య సేవలను అందించ నున్నట్టు ప్రకటించారు. 2019 అక్టోబరు 2 మహాత్మా గాంధీ 150వ జయంతికల్లా భారత్‌ను బహిరంగ మల మూత్ర విసర్జనా రహిత దేశంగా మార్చనున్నట్టు తెలిపారు. గ్రామాలలో సౖౖెతం కమ్యూనిటీ, వ్యక్తిగత టారులెట్ల నిర్మాణానికి తోడ్పడి ఓ.డి.ఎఫ్ (ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ) సాధిస్తామని పేర్కొన్నారు. ఇదో స్వచ్ఛతా ఉద్యమం అని పేర్కొంటూ అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సచిన్ టెండుల్కర్, సానియా మీర్జా వంటి ప్రముఖుల్ని ఎందరినో రంగంలోకి దింపారు. మరేమైంది? మోడీ ప్రధానిగా ఉన్న ఈ పదేళ్లలో స్వచ్ఛ భారత్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టు అర్థమయింది. గ్రామాల్లో, నగరాల్లో ఎక్కడ తిరిగినా ఎవరికి వారికి ఇది ప్రత్యక్ష అనుభవ సత్యం.
ఎక్కడబడితే అక్కడ చెత్త చెదారం, మురికి తాండవిస్తూనే ఉన్నది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఎక్కువ భాగం బహిరంగ మల విసర్జన ప్రాంతాలుగా కన్పిస్తూనే ఉంటాయి. అసలు దేశంలో సగం కుటుంబాలకు మాత్రమే (49 శాతం) మెరుగైన పారిశుధ్య సేవలు అందుతున్నాయని జాతీయ కుటుంబ సర్వే తెలిపింది. ముఖ్యంగా పేదరికంతో మురికి జతకూడి ఉంటుందనే విషయం మనం మరువరాదు. నగరాలు, పట్టణాల్లో మురికివాడలు పెరుగుతూనే ఉన్నాయి. గ్రామాలు దారిద్య్రంతో అల్లాడుతూనే ఉన్నాయి. మురికిని తొలగించాలంటే ముందుగా పేదరిక నిర్మూలన జరగాల్సిందే. ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు, పేదలకు తాగు నీరే కరువైనప్పుడు టాయిలెట్ల నిర్మాణంతో వారికి పని ఏమి? మిషన్ యాటిట్యూడ్ (దృక్పథం) అంటే తాను నిర్విరామంగా చేస్తూ ఇతరులచే ఆ పని చేయించడం, గాంధి కృషి ఆ విధంగా ఉంది గనుకనే ప్రజా నాయకుడయ్యాడు.
ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా మన దేశం మానవ వనరులతో అలరారుతున్నది. చిత్తశుద్ధితో కృషి చేసినపుడు ఏదీ సాధ్యం కాకమానదు. చెత్త, మురికి ఎక్కువగా పేరుకు పోవడానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ ఉత్పత్తులు, వాటి వాడకం. వాటిని నియంత్రించడంలో ప్రభుత్వ విధి విధానాలు తోడ్పడాలి తప్ప అది అదే, ఇది ఇదే అన్నట్టు వ్యవహరిస్తే చివరకు స్వచ్ఛ భారత్ శ్రమదానం ఓ ఫార్స్‌గా, మొక్కుబడి కార్యక్రమంగా మిగిలిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అలాగే పచ్చదనం అడవుల పెంపకానికి, ప్రకృతి సంరక్షణకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనా చర్యలు చేపట్టాలి. పౌరుల దైనందిన జీవనంలో పచ్చదనం-పరిశుభ్రత అంతర్భాగం అయ్యేలా ఎక్కడికక్కడ నిర్దిష్ట ప్రణాళికలు రచించి అమలు పరచాలి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో అందర్నీ భాగస్వాముల్ని చేయాలి. నాయకుడు ముందుండి నడిపించాలి. లేని పక్షంలో స్వచ్ఛ భారత్ అనేది ఎప్పటికీ నిజంగాని ఓ పగటి కలగానే మిగిలిపోతుంది.
/వ్యాసకర్త సెల్ : కె. శాంతారావు, 9959745723 /