Apr 17,2023 21:22
  • సెన్సెక్స్‌ 520 పాయింట్ల పతనం

ముంబయి : వరుసగా తొమ్మిది రోజుల పాటు లాభాల పరంపరను సాగించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలు చవి చూశాయి. ఐటి షేర్లు కుప్పకూలడంతో సూచీలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఉదయం నుంచే నష్టాల్లో సాగిన బిఎస్‌ఇ సెన్సెక్స్‌ తుదకు 520 పాయింట్లు పతనమై 59,911కు పడిపోయింది. ఇంతక్రితం తొమ్మిది సెషన్లలో ఈ సూచీ 2,816 పాయింట్లు రాణించింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 17.707 వద్ద ముగిసింది. సెనెక్స్‌ా30లో ఇన్ఫోసిస్‌ ఏకంగా 9.4 శాతం పతనమయ్యింది. ఓ దశలో ఆ కంపెనీ షేరు బిఎస్‌ఇలో 12.21 శాతం నష్టపోయి రూ.1,219 వద్ద ముగిసి.. 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. ఒక్క పూటలోనే కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు రూ.73,000 కోట్లు కోల్పోయింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. టెక్‌ మహీంద్రా, హెచ్‌సిఎల్‌ టెక్నలాజీస్‌, విప్రో, టిసిఎస్‌ సూచీలు 2-5 శాతం వరకు నష్టపోయాయి. ఎల్‌అండ్‌టి, ఎన్‌టిపిసి, హెచ్‌డిఎఫ్‌సి సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం ప్రతికూలతలో ప్రారంభమైన సూచీలకు ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. వరుస లాభాల నేపథ్యంలోనూ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. నిఫ్టీలో ఐటి రంగం సూచీ 4.71 శాతం నష్టపోయింది. ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు స్వల్పంగా విలువ కోల్పోయాయి. మార్కెట్లు భారీ నష్టాలు చవి చూడకుండా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు 3.13 శాతం, రియాల్టీ 1 శాతం, ఎఫ్‌ఎంసిజి 1.03 శాతం చొప్పున పెరిగి కొంత మద్దతును అందించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ 0.5 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.2 శాతం చొప్పున పెరిగాయి.