జమ్మూ : జమ్ము కాశ్మీర్ చినాబ్ లోయలోని దొడా జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 36మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. 300 అడుగుల లోతైన గోతిలో బస్సు పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి కొద్ది నిముషాలు ముందుగానే చెక్‌పాయింట్‌ను దాటిన బస్సు ఒక్కసారిగా రోడ్డుపై నుండి జారి అస్సార్ ఏరియాలోని లోయలో పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి గల కారణమేంటో వెంటనే తెలియరాలేదు. పెద్ద పెద్ద రాళ్లను ఢకొీడుతూ కిందికి పడటంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించినవారి కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు అందజేయనున్నట్లు పిఎంఓ ఎక్స్‌లో పోస్టు చేసింది. జమ్ముకాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు. బాధితులకు అవసరమైన సాయాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అభివృద్ధి గురించి పదేపదే మాట్లాడే కన్నా ప్రజా భద్రతకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ కోరారు.
తరిగామి సంతాపం
ఘోర రోడ్డు ప్రమాదం పట్ల సిపిఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దొడా జిల్లా మృత్యుకుహరంగా మారిందని, ఇటువంటి ప్రమాదాలు సర్వ సాధారణమై పోతున్నాయని అన్నారు. ఇటువంటి ప్రమాదాలను అడ్డుకునేందుకు వేసిన కమిటీ సిఫార్సులు చేసినా ఇంతవరకు వాటిని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సంతాపాలు, సానుభూతులు వ్యక్తం చేస్తే సరిపోదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు అధ్యయనం చేయాలని కోరారు. బాధితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు.