Oct 03,2023 12:29

ముంబయి  :   మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల మృతి ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 24 గంటల వ్యవధిలో 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది మరణించగా, అర్థరాత్రి మరో ఏడుగురు రోగులు మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. దీంతో నాందేడ్‌ ఆస్పత్రిలో గడచిన 48 గంటల వ్యవధిలో మృతుల సంఖ్య 31కి చేరింది. 31 మంది మృతుల్లో 16 మంది చిన్నారులు, శిశువులు ఉండటం గమనార్హం. ఆస్పత్రిలో మరో 71 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణలను ఆస్పత్రి డీన్‌ డా. శ్యామ్‌రావ్‌ వాకోడ్‌ తోసిపుచ్చారు. మందులు, వైద్యుల కొరత లేదని, సరైన చికిత్స అందించినప్పటికీ రోగులు స్పందించడం లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం వైద్యుల కొరత ఉందని వెల్లడించిన డీన్‌ మరుసటి రోజు మాట మార్చడం గమనార్హం. మరణాలపై మహారాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి హసన్‌ ముష్రీఫ్‌ స్పందించారు. నాందేడ్‌కు వెళుతున్నానని అన్నారు. మందులు, వైద్యుల కొరత లేదని అన్నారు. వైద్యుల నిర్లక్ష్యమని తేలితే.. కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ మరణాలపై విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. రోగుల మరణాలపై దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.