న్యూఢిల్లీ : మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సిఎం అజిత్ పవార్ వర్గాలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత వేటు పిటిషన్‌లపై చర్యలకు సుప్రీంకోర్టు సోమవారం డెడ్‌లైన్ విధించింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ( ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద దాఖలైన శివసేన వర్గం పిటిషన్‌పై డిసెంబర్ 31లోపు నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను ఆదేశించింది. అలాగే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గంపై ఎన్‌సిపి దాఖలు చేసిన పిటిషన్‌లపై 2024, జనవరి 31లోగా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. పదవ షెడ్యూల్ గౌరవం కాపాడాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరియు ఇతర ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద అసెంబ్లీ స్పీకర్ చర్యలు చేపట్టడంలో జాప్యంపై ఈ నెల 13న సుప్రీంకోర్టు నార్వేకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విచారణను మరింత పొడిగించకుండా వచ్చే ఎన్నికల్లోగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. అవసరమైన చర్యల కోసం టైమ్‌లైన్‌ను సమర్పించేందుకు ఆ సమయంలో స్పీకర్ నార్వేకర్‌కు వారం రోజుల గడువు కూడా ఇచ్చింది.