Oct 30,2023 14:36

ముంబయి :    మహారాష్ట్రంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే ప్రకాష్‌ సోలంకి నివాసానికి సోమవారం ఆందోళన కారులు నిప్పు పెట్టారు. బీద్‌ జిల్లాలోని ఆయన నివాసంపై రాళ్లు రువ్వడంతో పాటు బయట పార్క్‌ చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. మరాఠా కోటా వివాదంపై కార్యకర్త మనోజ్‌ జరాంజే పాటిల్‌ చేపట్టిన నిరాహార దీక్ష పై ఎమ్యెల్యే సోలంకి వ్యాఖ్యలపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన నివాసానికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.

దాడి సమయంలో తాను నివాసంలో ఉన్నానని, కుటుంబసభ్యులు, సిబ్బంది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. తాము క్షేమంగానే ఉన్నామని, అయితే భారీగా ఆస్తి నష్టం జరిగిందని సోలంకి పేర్కొన్నారు.  మంటలు ఎగిసిపడుతుండగా ఆప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

మరాఠా కోటా వివాదంపై ఆందోళనలు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లపై కూడా ప్రభావం చూపాయి. నేడు పూణెలో జరగనున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో శ్రీలంక తలపడుతోంది. మ్యాచ్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ఆందోళన కారులను వెనక్కిపంపారు.