Oct 31,2023 16:09

ముంబయి :   మహారాష్ట్రంలోని బీద్‌ జిల్లాలో మరాఠా కోటా ఉద్యమం మరింత తీవ్రమైంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించినట్లుబీద్‌ ఎస్‌పి నంద్‌ కుమార్‌ ఠాకూర్‌ మంగళవారం తెలిపారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి 49 మందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.

ఒబిసి కేటగిరీ కింద ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠా కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్‌ జరంగే గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి షిండేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జరంగే ఆరోగ్యం క్షీణిస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. జిల్లాలోని మజల్గావ్‌ మునిసిపల్‌ భవనం మొదటి అంతస్తుకు ఆందోళనకారులు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.

జరంగే దీక్షపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్‌సిపి ఎమ్మెల్యే ప్రకాష్‌ సోలంకి నివాసంపై దాడి చేశారు. ఆయన నివాసం ఎదుట పార్క్‌ చేసిన వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మరో ఎన్‌సిపి ఎమ్మెల్యే సందీప్‌ క్షీరసాగర నివాస ప్రాంగణంలోకి, కార్యాలయంలోకి ఆందోళన కారులు దూసుకెళ్లారు. రాష్ట్ర మాజీ మంత్రి జయదత్‌ నివాసంపై రాళ్లదాడికి పాల్పడ్డారు.