Aug 18,2023 13:20

ఇస్లామాబాద్‌  :   కాశ్మీర్‌ వేర్పాటు వాద నేత యాసిన్‌ మాలిక్‌ భార్య ముషాల్‌ హుస్సేన్‌ మాలిక్‌ను పాకిస్తాన్‌ కొత్త తాత్కాలిక ప్రధాని అన్వారుల్‌ హక్‌ కకర్‌కు ప్రత్యేక సలహాదారుగా నియమించింది. గురువారం అర్థరాత్రి వెల్లడించిన ఐదుగురు ప్రధాని ప్రత్యేక సలహాదారు (ఎస్‌ఎపిఎం) జాబితాలో ఆమె పేరు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముషాల్‌ మానవహక్కులు, మహిళా సాధికారతపై ప్రధానికి ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. జవాద్‌ సోహ్రాబ్‌ మాలిక్‌ విదేశీ పాకిస్తానీల కోసం ప్రత్యేక సలహాదారుగా నియమితులు కాగా, సముద్రవ్యవహారాల సలహాదారుగా వైస్‌ అడ్మిరల్‌ (రిటైర్డ్‌) ఇఫ్తికార్‌ రావు, పర్యాటకానికి టీవీయాంకర్‌ మరియు రచయిత వాసిహ్ షా, సమాఖ్య విద్య మరియు వృత్తిపరమైన శిక్షణ సలహాదారుగా సయ్యద్‌ ఆరిఫ్‌ జెహ్రా నియమితులయ్యారు. ప్రత్యేక సలహాదారు జూనియర్‌ మంత్రి కంటే తక్కువ హోదాను కలిగి ఉంటారు. అయితే కీలక సమస్యలపై ప్రధానికి సహాయం అందిస్తారు.
గురువారం పాకిస్తాన్‌ అధ్యక్షభవనం ఐవాన్‌-ఎ-సదర్‌లో 19 మంది సభ్యుల తాత్కాలిక క్యాబినెట్‌తో అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో యాసిన్‌కు ట్రయల్‌ కోర్టు జీవిత ఖైదు విధించడంతో.. యాసిన్‌ మాలిక్‌ ప్రస్తుతం జైలులో ఉన్నారు.