Oct 27,2023 15:23

ఇస్లామాబాద్‌ :  పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పిటిఐ) చైర్మన్‌, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు శుక్రవారం పాకిస్తాన్‌ కోర్టు నిరాకరించింది. అలాగే   రహస్య పత్రాల లీకేజీ  కేసులో మొదటి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది.

గతేడాది మార్చిలో దౌత్య సంబంధమైన రహస్య పత్రాలను  వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయానికి పంపారంటూ ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఇమ్రాన్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాకిస్తాన్‌లోని ప్రత్యేక కోర్టు అక్టోబర్‌ 23న ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మొహమూద్‌ ఖురేషీలను నిందితులుగా చేర్చింది.

ఈ కేసులో బెయిల్‌ కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టు (ఐహెచ్‌సి)ని ఆశ్రయించారు. అలాగే ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ (ఎఫ్‌ఐఎ) ఆగస్టులో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కూడా అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొంది. అక్టోబర్‌16న ఈ పిటిషన్‌లను విచారించిన ఐహెచ్‌సి చీఫ్‌ జస్టిస్‌ ఆమీర్‌ ఫరూఖ్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. నేడు తీర్పు వెలువరించారు.