ఇస్లామాబాద్ : సిఫర్ కేసులో అరెస్టయి ఇప్పటికే అదియాలా జైల్లో వున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తోషఖానా బహుమతుల కేసులో, అల్-ఖదిర్ ట్రస్టు కేసులో కూడా అవినీతి నిరోధకబ్యూరో అధికారులు అరెస్టు చేసినట్లు మీడియా వార్తలు మంగళవారం తెలిపాయి. అరెస్టు వారంట్లను అకౌంటబిలిటీ కోర్టు జడ్జి మహ్మద్ బషీర్ ధ్రువీకరించి, వెంటనే అమలు చేయాల్సిందిగా అదియాలా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించడంతో సోమవారం ఎన్‌ఎబి (నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో) అధికారులు అరెస్టు చేశారని డాన్ వార్తా పత్రిక పేర్కొంది. ఇమ్రాన్‌ను రిమాండ్‌కు అప్పగించినట్లు కోర్టు నుండి సమాచారం అందగానే ఎన్‌ఎబి బృందం జైల్లోనే ఆయనను విచారిస్తుంది. అరెస్టు వారంట్లను అమలు చేయడమంటే ఆ రెండు కేసుల్లో కూడా ఆయనను అరెస్టు చేసినట్లే. ఎన్‌ఎబి నమోదు చేసిన కేసులో తాజా అరెస్టు వారంటు జారీ అయింది. ఈ రెండు కేసుల్లోనూ తాము ఇమ్రాన్‌పై విచారణను పూర్తి చేయాల్సి వున్నందున వెంటనే ఆయనపై అరెస్టు వారంట్లు జారీ చేయాల్సిందిగా కోరుతూ ఎన్‌ఎబి కోర్టును ఆశ్రయించింది.