ఇస్లామాబాద్ : పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జైల్లో సిఫర్ కేసు విచారించడాన్ని సవాలు చేస్తూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వేసిన పిటిషన్‌పై తీర్పును పాక్ కోర్టు మంగళవారం రిజర్వ్ చేసుకుంది. తోషఖానా అవినీతి కేసులో దోషిగా నిర్ధారణ అయిన తర్వాత ఆగస్టు 5 నుంచి ఇమ్రాన్ జైల్లోనే వున్నారు. ఆయన జైలుశిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఆగస్టు 29న నిలుపుచేసింది. సిఫర్ కేసులో ఆయన ఇంకా జైల్లోనే వున్నారు. ఈ కేసులో రిమాండ్‌ను ప్రత్యేక కోర్టు సెప్టెంబరు 13వరకు పొడిగించింది. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఇమ్రాన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. సిఫర్ కేసు విచారణ జరుగుతున్న వేదికను మార్చడం వెనుక దురుద్దేశం వుందని ఇమ్రాన్ తరపు న్యాయవాది ఆరోపించారు. ఇమ్రాన్‌ను జైల్లోనే వుంచాలనే తలంపుతోనే ఇలా విచారణా వేదికను మార్చినట్లు కనిపిస్తోందని అన్నారు. అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన కింద నమోదైన కేసు విచారణ ప్రత్యేక కోర్టులో జరగాలని ఆయన చెప్పారు. ఏ చట్టం, నిబంధనల కింద ఇలా విచారణా వేదికను జైల్లోకి మార్చారో చెప్పాలని ఆయన కోరారు.