- ఎస్పీ ఆదేశాలతో..చీరాలలో కార్డన్ సెర్చ్..
- టూటౌన్ స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సిఐ సోమ శేఖర్
- రోశయ్య కాలనిలో 8 ద్విచక్ర వాహనాలను, 4 ఆటోలను సీజ్ చేసిన పోలీసులు
- గంజాయినిపై ఉక్కు పాదంతో దిశగా జిల్లా ఎస్పీ
ప్రజాశక్తి-చీరాల: గంజాయిని సేవించే వారిని ఇప్పటి వరకు బాధితులుగా గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని, ఇక నుండి గంజాయిని సేవించే వారిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. జులై 16 ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ పి.మహేష్ సూచనలతో చీరాల డి.ఎస్.పి ప్రసాద్ రావు పర్యవేక్షణలో చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ సారధ్యంలో చీరాల సెబ్ సిఐ, ఎస్.ఐ లు, చీరాల 2వ, 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ లు, కారంచేడు, చీరాల రూరల్ ఎస్.ఐ లు మరియు 55 మంది పోలీస్ సిబ్బంది చీరాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోశయ్య కాలనిలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది.గంజాయి, నాటుసారా ఇతరుల అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల 2 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోశయ్య కాలనిలో పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు చీరాల సెబ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో పత్రాలు లేని అనుమానిత 8 ద్విచక్ర వాహనాలను, 4 ఆటోలను పోలీస్ అధికారులు సీజ్ చేసినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపి అణచివేసెందుకు గంజాయి, నాటుసారా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు అన్నారు. అందులో భాగంగా అనుమానిత ప్రాంతాలలో జిల్లా పోలీస్ అధికారులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నారన్నారు. గతంలో రోశయ్య కాలనిలో పరిసర ప్రాంతాలలో నివాసముండే కొంతమంది నాటుసారా, గంజాయి క్రయ, విక్రయాలకు సంబంధించిన కేసులలో పట్టుబడినారు కనుక ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన కేసులలో పట్టుబడిన వారిపై సస్పెక్ట్ షీట్స్ తెరుస్తున్నామని, ఇప్పటి వరకు జిల్లాలో 156 మందిపై సస్పెక్ట్ షీట్ లు తెరిచామన్నారు. గంజాయి విక్రయించే వారు విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని విక్రయాలు జరిపే అవకాశం ఎక్కువగా ఉండడంతో, ముందు విద్యార్థులకు గంజాయి సేవించడం వలన కలిగే అనర్ధాలు, ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించి మత్తుపదార్ధాల విషపు కూపంలో కూరుకు పోకుండా వారిలో చైతన్యం తీసురావడానికి జిల్లాలో "సంకల్పం" కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు."సంకల్పం" కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వలన కలిగే అనర్ధాల గురించి కళాశాల ఆవరణలో ఫ్లక్సీ లు ఏర్పాటు చేసి, వీడియోలు, పిపిటిల ద్వారా, ఉపన్యాసాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించి, వారిచే డ్రగ్స్ కు దూరంగా ఉంటామనే ప్రతిజ్ఞ చేయించి,క్విజ్ పోటీలు నిర్వహించి, కళాశాలలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, కళాశాలలో గంజాయి, డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలపడానికి కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు."సంకల్పం" కార్యక్రంలో భాగస్వాములైన కళాశాల యాజమాన్యానికి సర్టిఫికెట్ అందించడం జరిగిందన్నారు.ఇప్పటి వరకు గంజాయిని సేవించే వారిని బాధితులుగా గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని, ఇక నుండి గంజాయిని సేవించే వారిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కనుక గంజాయికి, ఇతర మత్తు పదార్ధాలకు విద్యార్థులు, యువకులు దూరంగా ఉండాలన్నారు.గంజాయి, ఇతర ఆసాంఘిక కార్యకలాపాల గురించిన సమాచారం తెలిసినజేయలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. ఎలాంటి సమచారం ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కు గానీ, డైల్ 100, ఎస్పీ బాపట్ల హెల్ప్ లైన్ నెంబర్ 8333813228 కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.










