న్యూఢిల్లీ : కులగణన సర్వే నివేదికను ప్రచురించకుండా, లేదా తదుపరి చర్యలు తీసుకోకుండా బీహార్ ప్రభుత్వంపై స్టే విధించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రాన్ని అడ్డుకోలేమని పేర్కొంది. కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. బీహార్ ప్రభుత్వం కొంత డేటాను ప్రచురించడం ద్వారా స్టేఆర్డర్‌కు ముందస్తు చర్యలు తీసుకుందన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సమయంలో తాము స్టే విధించలేమని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా తాము ఆపలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ సర్వేను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారానికి సంబంధించిన ఇతర అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలిపింది.
ఈ వ్యవహారంలో గోప్యతకు భంగం కలిగిందని, హైకోర్టు తీర్పు సరికాదని పిటిషనర్ల తరపు న్యాయవాది అప్రజిత్ సింగ్ కోర్టులో వాదనలు వినిపించారు. ఏ వ్యక్తి పేరు, ఇతర గుర్తింపులను ప్రచురించనందున ఇది గోప్యత ఉల్లంఘన జరిగిందనే వాదన సరికాదని పేర్కొంది. డేటా ,అది ప్రజలకు చేరువవడం ముఖ్యమని తెలిపింది.
ఈ నెల 2న బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణన సర్వే నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర మొత్తం జనాభాలో ఒబిసి, ఇబిసిలు అత్యధికంగా 63 శాతం ఉన్నారని నివేదిక వెల్లడించింది.