
న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. మసీదు నిర్మాణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, తవ్వకాలు జరపకుండా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) సర్వే చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే మొత్తం తవ్వకాలు, చొరబాటు ప్రక్రియ లేకుండా జరగాలని స్పష్టం చేసింది. సర్వే సమయంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టడం లేదని, మసీదులోని గోడలను కూడా తాకడం లేదని అలహాబాద్ హైకోర్టు జడ్జికి ఎఎస్‌ఐ ఇచ్చిన నివేదికను పరిశీలించామని ధర్మాసనం పేర్కొంది. శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముస్లిం మత పెద్దలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.