Nov 09,2023 12:25

న్యూఢిల్లీ :   ఎంపిలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు  హైకోర్టులను ఆదేశించింది.   విచారణకు ఉమ్మడి మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియని ధర్మాసనం పేర్కొంది.    ఎంపిలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌లపై గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని  ధర్మాసనం విచారణ జరిపింది. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ వ్యవహారాలను త్వరగా పరిష్కరించేలా పర్యవేక్షించడానికి సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని తీర్పు పేర్కొంది. కేసుల వివరాలు, విచారణలో ఉన్న అంశాలకు సంబంధించిన వివరాలను జిల్లా, ప్రత్యేక న్యాయస్థానాల నుంచి సేకరించి హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యేక ట్యాబ్‌ ఏర్పాటు చేసి వాటి వివరాలు పొందుపరచాలని హైకోర్టులకు సూచించింది.