Oct 18,2023 10:37

అవసరమనుకుంటే పార్లమెంట్‌ చట్టం తేవచ్చు
-సుప్రీం ధర్మాసనం మెజార్టీ తీర్పులో వెల్లడి
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కుల సంబంధాలను గుర్తించినప్పటికీ, వారి మధ్య వివాహాలను ఆమోదించలేమని చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం 3-2 తేడాతో ఇచ్చిన తన మెజార్టీ తీర్పులో స్పష్టం చేసింది. అవసరమనుకుంటే పార్లమెంటు దీనిపై చర్చించి, చట్టం తెచ్చుకోవచ్చని చంద్రచూడ్‌తో సహా ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కమనేది కేవలం పట్టణ ప్రాంతాలకు లేదా కులీన వర్గాలకు మాత్రమే పరిమితమైన భావన కాదని ఐదుగురు న్యాయమూర్తులు అంగీకరించారు.
ప్రత్యేక వివాహ చట్టంలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పేర్కొంది. స్వలింగ వివాహాలను చట్టం కింద గుర్తించాలంటూ పిటిషనర్ల బఅందం వేసిన అభ్యర్థనను విచారించిన అనంతరం సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారానికి కేంద్రం ఒక కమిటీని వేయాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. మే 3న కేబినెట్‌ సెక్రటరీ నేతఅత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
దత్తత హక్కుకు సంబంధించిన అంశంపై ధర్మాసనంలో ఏకాభిప్రాయం లేదు. . ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ , జస్టిస్‌ ఎస్‌ కె కౌల్‌ స్వలింగ జంటలు దత్తత తీసుకునే హక్కును గుర్తించారు. మరోవైపు జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహ, జస్టిస్‌ హిమ కోహ్లీ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.
స్వలింగ సంపర్కులైన జంటలను గుర్తించేందుకు ఒక క్రమబద్దీకరణ యంత్రాంగాన్ని రాజ్యాంగ అధికారులు రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌, మరో న్యాయమూర్తి జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ అభిప్రాయపడ్డారు. వివాహ బంధంలోకి ప్రవేశించేందుకు లైంగికత ప్రాతిపదికగా ఒక జంటకు గల హక్కును నియంత్రించలేమని ఇరువురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. లైంగికత ప్రాతిపదికన వివక్ష చూపడమనేది రాజ్యాంగంలోని 15వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఎస్‌.ఆర్‌.భట్‌, హిమా కోహ్లి, పి.ఎస్‌.నరసింహలు ఈ పాయింట్‌తో విభేదించారు. దీనికి ఒక క్రమబద్ధమైన మెకానిజాన్ని రూపొందించాల్సిన బాధ్యత పార్లమెంటుదే తప్ప న్యాయస్థానానిది కాదని స్పష్టం చేశారు.
''స్వలింగ సంబంధాలు పురాతన కాలం నుండి గుర్తించబడ్డాయి, కేవలం లైంగిక కార్యకలాపాలకు మాత్రమే కాకుండా, మానవ భావోద్వేగాల నెరవేర్పుకునేందుకు అవసరమైన సంబంధాలుగా గుర్తించబడ్డాయి. నేను కొన్ని సూఫీ సంప్రదాయాలను ప్రస్తావించాను. ప్రధాన న్యాయమూర్తి తీర్పుతో నేను ఏకీభవిస్తున్నాను. కోర్టులు రాజ్యాంగ నైతికత ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి, సామాజిక నైతికత కాదు అని చీఫ్‌ జస్టిస్‌ పేర్కొన్నారు. జస్టిస్‌ భట్‌ స్వలింగ సంపర్కం పట్టణం లేదా ఉన్నతవర్గం భావన కాదని అంగీకరించారు. స్వలింగ జంటల కోసం న్యాయస్థానం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించలేదని జస్టిస్‌ భట్‌ పేర్కొన్నారు. ఈ అంశాన్ని చట్టసభల పరిశీలనకే వదిలివేస్తున్నామన్నారు. ''వ్యవస్థాగత పరిమితుల కారణంగా ప్రత్యేక వివాహ చట్టాలను కోర్టులు కొట్టేయలేవు'' అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.