వ్యక్తి స్వభావం, స్వేచ్ఛ, వికాసాలు సమాజంతో పెనవేసుకొని వుంటాయ'ని మార్క్స్ అభిప్రాయం. అంతేకాదు... 'ఒక వ్యక్తి మానసిక ఔన్నత్యం అతని వాస్తవ సంబంధాలపై ఆధారపడి వుంటుంది' అని కూడా ఆయన చెప్పాడు. లక్షల కోట్ల ఆస్తులున్న కార్పొరేట్లు ఒక పక్క, లక్షల్లో అప్పులున్న కోట్లాది మంది రైతులింకో పక్క వున్న సమాజం మనది. ఈ భయంకరమైన అసమానతల్ని సరిచేసే బదులు మానవ వనరులను, ప్రజల శ్రమను దోచుకోడానికి, లేదా ప్రజలను తమ గుప్పిట వుంచుకోడానికి లేదా అణచివేయడానికి ఈ స్వేచ్ఛ అనే పదాన్ని, ఈ భావనను ఒక ముసుగులా వాడుతున్నారు పాలకులు. అసలు నిజమైన 'స్వేచ్ఛ అంటే... దోపిడీ నుంచి, వర్గ అణచివేత నుంచి, వర్గ వైరుధ్యాల నుంచి విముక్తి' అని 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో మార్క్స్, ఎంగెల్స్ చెబుతారు. నిస్సందేహంగా ఇలాంటి స్వేచ్ఛ ఏ పెట్టుబడిదారుడికీ నచ్చదు. కాబట్టి, పెట్టుబడిదారుల దోపిడీ నిరాటంకంగా కొనసాగుతోన్న ఏ దేశంలోనైనా స్వేచ్ఛ అనే మాటకు, భావనకు అర్థం లేదు. స్వేచ్ఛ అనే పేరుతో ఒక ముసుగు తగిలించి దేశీయ మార్కెట్ ను కార్పొరేట్ల కబంధహస్తాల్లోకి నెమ్మది నెమ్మదిగా నెట్టేస్తున్నారు శ్రీమాన్ మోడీ.
స్వేచ్ఛా మార్కెట్ పేరుతో మీ సరుకులను, మీ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చాలా ఉదారంగా ప్రకటించేశారు. వాస్తవానికి ఇలాంటి విధానం వల్ల లాభం పొందేది అంబానీలు, అదానీలు మాత్రమే. ముఖ్యంగా దేశంలోని వ్యవసాయాన్ని వీరికి కట్టబెట్టేది ఆహార ధాన్యాలను పండించేందుకు కాదు. పూలు, పండ్లు, కాయగూరలు వంటి వాటిని పండించడం, వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం. తద్వారా లాభాలు గడించడమే వారి చాణక్యం. ఫలితంగా ఆహారధాన్యాలు పండించాల్సిన భూములు ఇతర ఎగుమతి పంటలకు బదలాయించబడతాయి. దీంతో మార్కెట్లు మూతబడతాయి. రైతాంగం దెబ్బతింటుంది. ఇక మార్కెట్లు వుండవు, మార్కెట్ కమిటీలు, సహకార సంఘాలు వంటివీ వుండవు. అసలు రైతుకు భరోసాయే వుండదు. కర్రసాయంతో నడిచే వ్యక్తికి... నీకు స్వేచ్ఛనిచ్చాను, ఎంతదూరమైనా పరుగెత్తు, ఎంత ఎత్తునుండైనా దుముకు అంటూ... ఆయన చేతిలోని కర్రను లాక్కుంటే... ఆ వ్యక్తి ఒక్క అడుగు కూడా వెయ్యలేడు సరికదా అక్కడే కూలబడతాడు. ఒకటి రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు దేశంలో సుమారు 85శాతం ఉన్నారు. వీరంతా పండించిన పంటను స్థానిక వ్యాపారులకో, స్థానిక మార్కెట్ లోనో విక్రయించుకోడానికే నానాతంటాలు పడుతుంటారు. అలాంటిది ఒక ఎకరాలో వచ్చిన పంటను దేశంలో ఎక్కడ అమ్ముకోగలుగుతాడు? ఆ వ్యక్తి చేతిలో కర్ర లాగేసిన చందంగా... రైతుకు వున్న కాస్త ఊతం కూడా స్వేచ్ఛా మార్కెట్ పేరుతో పీకేసే ప్రయత్నం ఇది. తద్వారా రైతును భూమినుండి దూరం చెయ్యడమే. కాదు కాదు గెంటేయడమే.
'అదుగో, ముందున్నాడే అతడే డబ్బు యజమాని. ఇప్పుడు పెట్టుబడిదారుడిగా మున్ముందుకి సాగిపోతున్నాడు. శ్రమశక్తి యజమాని అతని కార్మికునిగా అతని వెనుక అనుసరిస్తున్నాడు. ఒకరు హుందాగా, ధీమాగా, వ్యవహర్తలా. మరొకరు పిరికిగా, సంకోచంగా, సొంత తోలు అమ్ముకోడానికి మార్కెట్‌కు వచ్చినవాడిలా, తోలు ఒలిపించుకోడానికి సిద్ధంగా.' అంటాడు కారల్ మార్క్స్ పెట్టుబడి గ్రంధంలో. ఈ స్వేచ్ఛ కూడా ఇలాంటిదే. నియంత్రణలేని స్వేచ్ఛా మార్కెట్‌లో రైతైనా, కార్మికుడైనా దోపిడీకి గురికావాల్సిందే. తోలు ఒలిపించుకోవాల్సిందే. 'నేను నా కోసం పుట్టాను/ మార్కెట్ కోసం పెరిగాను/ నేను మార్కెట్ మనిషిని' అంటాడో కవి. సింహాలు యథేచ్ఛగా సంచరించే మహారణ్యంలో... మేకల్లా బలికావాల్సిందే. ఇంకా రక్షణ ఎక్కడుంటుంది? మేకలను రక్షించాలంటే... సింహాలకైనా కంచె వెయ్యాలి, మేకలకైనా కంచె వెయ్యాలి. ఇప్పుడు ఉన్న కంచెలను కూడా తొలగించి, నీకు స్వేచ్ఛ ప్రసాదించాననడం సింహం నోటికి ఫలహారం అందించడమే. బలవంతులూ, బలహీనులూ వున్న సమాజంలో ఒక సమన్యాయం అమలు కావాలంటే... బలవంతులకు కొన్ని ఆంక్షలు, బలహీనులకు కొన్ని రక్షణలు ఉండితీరాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. దోపిడీ నుంచి, అణచివేత నుంచి, ఆటవిక న్యాయం నుంచి విముక్తి కలిగినప్పుడే నిజమైన స్వేచ్ఛ పరిఢవిల్లుతుంది.










