ప్రజాశక్తి-యంత్రాంగం : మార్క్స్, ఎంగెల్స్ రచనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పలువురు వక్తలు అన్నారు. ఎంగెల్స్ ద్వి శత జయంతి సభలను సిపిఎం ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. విజయవాడలో ఎంగెల్స్, మార్క్స్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కుటుంబం - వ్యక్తిగత ఆస్తి - రాజ్యం ఆవిర్భావం, ఇతర అనేక పుస్తకాలన్నింటినీ సమాజ పురోగమనాన్ని పరిశీలించి రచించారని, ఆ రచనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుకెళ్లాలని అన్నారు. క్యాపిటల్ గ్రంథంలో మార్క్స్, ఎంగెల్స్ కృషి మిళితమై ఉందని, గతితార్కిక చారిత్రక పురోగమనాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంగెల్స్ రచనలను చదవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కార్మికులు, కష్టజీవులు వారి పోరాటాలకు పదును పెడతారని అర్థమవుతోందని, ఈ నెల 26, 27 తేదీల్లో కార్మికులు, కర్షకులు రోడ్లపైకి వచ్చి చేసిన పోరాటమే దీనిని తెలియజేస్తోందని అన్నారు. ప్రోగ్రెసివ్ ఫోరం నాయకులు చంద్రరావు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమెక్రసీ నాయకులు పి.ప్రసాద్, రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, విగ్రహాల కమిటీ నాయకులు సుబ్బరాజు, దివికుమార్ తదితరులు మాట్లాడుతూ ఎంగెల్స్ ప్రత్యేకతను కొనియాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాబూరావు, దడాల సుబ్బారావు, కె.స్వరూపరాణి, కె.సుబ్బరావమ్మ, కె.ధనలక్ష్మి, కె.ఉమామహేశ్వరరావు, విష్ణు, రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ, సిపిఐ నాయకులు జల్లి.విల్సన్, అక్కినేని.వనజ, ఆర్.రవీంద్రనాథ్, కెవిపిఎస్ నాయకులు అండ్ర మాల్యాద్రి పాల్గన్నారు. ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ నాయకులు బి.జమీందారు అధ్యక్షత వహించారు.
అనంతపురంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి మాట్లాడుతూ మానవాళికి ఎంతో మేలు చేసిన మహనీయుడు ఎంగెల్స్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి పాల్గన్నారు. విశాఖలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ దోపిడీ సమాజం నుంచి విముక్తి పొందడానికి మార్గాలను నిర్దేశించిన మహోపాధ్యాయుడు ఎంగెల్స్ అన్నారు. ఒంగోలులోని సుందరయ్య భవనంలో ఎంగెల్స్‌కు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సిద్ధయ్య నివాళులర్పించారు. గుంటూరు జిల్లాలో సిపిఎం, సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సభలు నిర్వహించారు. కర్నూలు, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎంగెల్స్‌కు నివాళులర్పించారు.










