సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోను సిపిఎం శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఓంకార్ షాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వామపక్ష ప్రత్యామ్నాయానికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ప్రజా వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బిజెపిని ఓడించి, రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం అత్యంత వేగంగా అమలు చేస్తున్న బడా కార్పొరేట్ల అనుకూల విధానాల వల్ల పేదలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ అంశాలపై ఆందోళనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిపిఎం అభ్యర్థులు ఎన్నికైతే అసెంబ్లీలోనూ ఈ అంశాలను లేవనెత్తుతారని చెప్పారు. ప్రజా సంక్షేమ, ప్రజానుకూల విధానాలను ప్రభుత్వం చర్చించేలా, అమలు చేసేలా ఒత్తిడి చేస్తారని తెలిపారు. బిజెపి ఐదేళ్ల పాలనలో నిరుద్యోగం, పేదరికం అత్యధిక స్థాయిలో పెరిగాయని, వ్యవసాయం చేస్తున్న రైతులు, పండ్ల తోటల పెంపకందారులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. పలు ప్రభుత్వ శాఖల్లో 63 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని, పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని, వ్యవసాయ, పండ్ల తోటల పెంపకందారులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, నిరుద్యోగులకు రూ.3 వేలు అలవెన్సు ఇవ్వాలని కోరుతూ మేనిఫెస్టోను విడుదల చేశారు.










