Nov 05,2020 08:00

స్వేచ్ఛా మార్కెట్‌ను విస్తృతం చేస్తూ మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఫలితంగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పి) అంశం బాగా ప్రచారంలోకొచ్చింది. అప్పుడప్పుడు, అదీ పంటలు మార్కెట్‌కొచ్చే తరుణంలో ఎంఎస్‌పి చర్చల్లోకి రావడం...తదుపరి సీజన్‌లో గుర్తు చేసుకోవడం...ప్రధాన మీడియాకు, రైతు యేతర సమాజానికి పరిపాటైంది. కాని వ్యవసాయ చట్టాలచ్చాక ఎంఎస్‌పి పై ప్రధాని లేవనెత్తిన విషయాలపై కార్పొరేట్‌ మీడియా అమిత ప్రచారం లంకించుకుంది. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోడానికి స్వేచ్ఛ కల్పించినప్పటికీ ఎంఎస్‌పి ఉండి తీరుతుందనేది మోడీ సహా బిజెపి ప్రభుత్వ పెద్దల 'హామీ'. సదరు హామీని నమ్మేదెలా? 2014 ఎన్నికల్లో బిజెపి ఎత్తుకున్న ప్రధాన నినాదం రైతులకు స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల అమలు. అందులో అతి ముఖ్యమైనది పంట పండించడానికి రైతులు పెట్టే ఖర్చుపై 50 శాతం కలిపి ఎంఎస్‌పి ప్రకటించడం. ఈ హామీని ఆరున్నరేళ్లలో బిజెపి సర్కారు తుంగలో తొక్కింది. పైగా సుప్రీంకోర్టుకు సర్కారు స్వయంగా స్వామినాథన్‌ కమిటీ సిఫారసును అమలు చేయలేమని అఫిడవిట్‌ ఇచ్చింది. ఇంకో వైపు పంట పండించేందుకు రైతులు పెట్టే ఖర్చులో కొంత భాగాన్నే పరిగణన లోకి తీసుకొని, దానిపై 50 శాతం కలిపి, ఇదిగో స్వామినాథన్‌ సిఫారసు అమలు చేసేశామని కొంత కాలం రైతులను భ్రమింపజేసే ప్రయత్నం చేసింది. మొత్తం పంట పండించడానికి అయ్యే వ్యయం (సి2) గణన లోనే తిమ్మినిబమ్మిని చేయబోయిన కేంద్రం ఇప్పుడు ఎంఎస్‌పి ఉంటుందని ఇచ్చే హామీకి ఎంత మాత్రం విలువ లేదు. వైద్యం, విద్య కార్పొరేటీకరణ జరిగాక గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి), ప్రభుత్వ పాఠశాలలు పేరుకే ఉన్నాయన్నది అనుభవం. అలాగే ప్రభుత్వ ప్రోద్భలంతో వ్యవసాయ చట్టాల ద్వారా సాగు కార్పొరేటీకరణ జరిగాక ఎంఎస్‌పి, దాన్ని అమలు చేసే మార్కెట్‌ యార్డులు (ఎఎంసి) కూడా పిహెచ్‌సి, సర్కారీ బడుల మాదిరే తయారవుతాయి.
హరిత విప్లవం వెలుగు
ఒక వ్యాపారి తయారు చేసిన వస్తువు ధరకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనప్పుడు, రైతులు ఉత్పత్తి చేసిన పంటల ఎంఎస్‌పి కి సర్కారు ఎందుకు పూచీ పడాలి అని ప్రశ్నిస్తున్నారు కొంత మంది కార్పొరేట్‌ అనుకూల మేధావులు. వ్యాపారుల మాదిరిగానే రైతు తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ వ్యవసాయ చట్టాల ద్వారా దఖలు పడుతుంటే ఇంకా ఎంఎస్‌పి అవసరమేంటని కుహనా సంస్కరణ వాదులు వాదిస్తున్నారు. ఎంఎస్‌పి అనేది రైతులకు ప్రభుత్వాలిచ్చే భిక్ష కాదు. అదొక సామాజిక బాధ్యత అని, జాతి మనుగడకు అదే కీలకమని రైతులు, ప్రతిపక్షాలే కాదు, ఎంఎస్‌పి విధానం తెచ్చిన కొన్ని దశాబ్దాల క్రితం ప్రభుత్వాలే నొక్కి చెప్పాయి. ఎంఎస్‌పి ప్రకటనే కాదు దాని అమలుకు మద్దతు ధరల అమలు పథకం (పిఎస్‌ఎస్‌) వచ్చింది. పెద్ద వ్యవస్థ నెలకొల్పబడింది. ఆహార ధాన్యాల దిగుబడులపై ఆధారపడ్డ పరిస్థితుల్లో, వరుస క్షామాలు పీల్చి పిప్పి చేస్తున్న తరుణంలో హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం జయప్రదానికి పిఎస్‌ఎస్‌ ఇరుసుగా పని చేసింది. ఎంఎస్‌పి లక్ష్యం దేశ అవసరాలకు తగ్గట్టు వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు. అది సార్ధకం కావాలంటే రైతుల పంటలకు గిట్టుబాటు ధరల కల్పన, స్థిరమైన ధరల అమలు కొనసాగాలి. రైతులు సాగులో విరివిగా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలి. భూమి, నీరు వాడకం క్రమబద్ధీకరణ (రేషన్‌ బ్యాలెన్స్‌) చేయాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదకాలు అందుబాటు లోకి రావాలి. అలాగే వినియోగదారులకు అవసరమైన ఆహార ధాన్యాలను సరసమైన తక్కువ ధరలకు అందించాలి. ఈ లక్ష్యాలన్నీ జాతి ప్రయోజనాల కోసమని ఎంఎస్‌పి-పిఎస్‌ఎస్‌ ఉద్దేశాల్లో చెప్పబడ్డాయి. ఆ ఉద్దేశాలను మరింత పరిపుష్టం చేసేందుకు కేరళ వామపక్ష ప్రభుత్వం కేంద్ర ఎంఎస్‌పి పరిధిలో లేని 16 రకాల పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలకు ఎంఎస్‌పి ప్రకటించి ఆదర్శంగా నిలిచింది.
పిడిఎస్‌ ప్రశ్నార్ధకం
కేంద్రం 25 పంటలకే ఎంఎస్‌పి ని ఖరీఫ్‌, రబీలకు ప్రకటిస్తోంది. వ్యవసాయ పంటల ఉత్పత్తి, ధరల కమిషన్‌ (సిఎసిపి) పంట పండించేందుకు రైతులు చేసే ముఖ్యమైన ఖర్చులను మదింపు చేసి 22 పంటలకు ఎంఎస్‌పి ని ప్రకటిస్తోంది. కొబ్బరి, చెరకు, ఆముదాలకు వేరే డిపార్టుమెంట్లు ఎంఎస్‌పి ని నిర్ణయిస్తున్నాయి. సి2 వ్యయాన్ని సిఎసిపి అంచనా వేసినప్పటికీ దాన్ని పరిగణన లోకి తీసుకోవట్లేదు. సిఎసిపి చేసిన సిఫారసులపై అంతిమ నిర్ణయం కేంద్ర క్యాబినెట్‌ దే. ఎంఎస్‌పి ని ప్రకటించడమే కాదు పంటల సేకరణకు ఎఫ్‌సిఐ, సిసిఐ, జెసిఐ, సిడబ్ల్యుసి, నాఫెడ్‌, సిసిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఎసి సంస్థలను కేంద్రం నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వాలూ పంటల సేకరణకు సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌, మార్క్‌ ఫెడ్‌ వంటి ఏజెన్సీలను నియమించుకుంటున్నాయి. పిడిఎస్‌ కు అవసరమైన ఆహార ధాన్యాల సేకరణకు కేంద్ర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఆయా సంస్థలు నిధులు సమకూర్చుకొని, ప్రభుత్వ సహాయంతో రైతుల నుంచి ఎంఎస్‌పిపై పంటలను కొనుగోలు చేస్తున్నాయి. ఇంతా చేస్తే రైతులు పండించే పంటలో 25 శాతాన్నే ఎంఎస్‌పి పై కొంటున్నాయి. ప్రత్యేక పరిస్థితులు వస్తే ఆ పరిమితి గరిష్టంగా 30 శాతం. తతిమ్మా 70-75 శాతాన్ని రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిందే.
ఆర్థిక వ్యవస్థ మనగలగాలంటే...
ప్రభుత్వం పలు సేకరణ సంస్థలను నెలకొల్పింది రైతులకు ఎంఎస్‌పి ఇవ్వడానికే కాదు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) సహా పలు ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన ఆహార ధాన్యాల సేకరణ కోసం. దీనిలో ప్రజల ఆహార భద్రత ఇమిడి ఉంది. ఇప్పటికే ఎఫ్‌సిఐ నేరుగా ధాన్యం సేకరణకు స్వస్తి పలికింది. వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాలకు ఆహార భద్రత అమలుకు నిర్ణయించిన కోటాను వాటినే సేకరించుకోమంది. అవసరమైన నిధులిస్తోంది. ప్రకృతి విపత్తులు, కరోనా మహమ్మారుల వంటి ఆపత్కాలాలల్లో ఆహార సరఫరా కోసం బఫర్‌ స్టాక్స్‌ కోసం ఎఫ్‌సిఐ కి తీసుకుంటోంది. అవే ఏడు కోట్ల టన్నులు గోదాముల్లో మూలుగుతున్నాయి. ఆహార ధాన్యాలను కాకుండా నగదు రూపంలో డైరెక్టు బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) చేస్తామంటోంది మోడీ సర్కారు. అంటే ఇప్పుడు పని చేసినట్లుగా కూడా ఎఫ్‌సిఐ, ఇతర సంస్థలు పని చేయవు. రైతులకు ఎంఎస్‌పి ఉండదు. ఆ ఉద్దేశంతోనే రైతులకు స్వేచ్ఛా మార్కెట్‌ అంటోంది బిజెపి ప్రభుత్వం. మనది వ్యవసాయక దేశం. 192 మిలియన్‌ హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. అందులో 120 మిలియన్‌ హెక్టార్లలో ఆహార ధాన్యాలు పండుతున్నాయి. సగటున 270 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. 130 కోట్ల జనాభాలో 58 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. రమారమి 20 కోట్ల మంది రైతులున్నారు. దేశ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17 శాతం. కరోనా సమయంలో అన్ని రంగాల వృద్ధి పడిపోయినా వ్యవసాయ వృద్ధి కొంతైనా బాగుందంటే అది రైతన్నల కష్టం. వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, కరోనా ఉపద్రవం కట్టకట్టుకొని రైతులపై దాడి చేస్తున్నాయి. ఏడాదికి పది వేల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంఎస్‌పి లక్ష్యాల్లో వివరించినట్లు ప్రజల ఆహార భద్రత, వినియోగదారులకు అందుబాటులో ఆహార ధాన్యాల ధరలు, ప్రజల జీవనోపాధి, పారిశ్రామికోత్పత్తి, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మనగలగాలంటే రైతులకు ఎంఎస్‌పి ఇవ్వాలి. అదే జాతి హితం.
కె.ఎస్‌.వి. ప్రసాద్‌
( వ్యాసకర్త సెల్‌ : 94900 99019 )