Nov 07,2022 21:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కన్నా తక్కువకు అమ్ముకున్నామన్న మాట ఒక్క రైతు నుండి కూడా రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయం అనుబంధ శాఖలపై సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో మిల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదని చెప్పారు. వారి జోక్యాన్ని రాష్ట్రంలో తీసివేస్తున్నామని చెప్పారు. ఈ విధానం ద్వారా రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందాలని, ఖచ్చితంగా గిట్టుబాటు ధర లభించాలని చెప్పారు. ఇ-క్రాపింగ్‌ డాటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరణ నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు 93 శాతం రైతుల నుండి ఇకెవైసి పూర్తయిందని తెలపగా, మిగిలిన ఏడు శాతం మంది నుండి కూడా పూర్తిచేయాలని సిఎం ఆదేశించారు. రబీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎరువులు, విత్తనాలు, ఇలా అనిు రకాలుగా రైతులకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పొలంబడి కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులను అప్రెంటిస్‌షిప్‌ చేయించడం ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఆర్‌బికెలో ఒక డ్రోన్‌ ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. వచ్చే రెండేళ్లలో అనిు ఆర్‌బికెల్లో డ్రోన్స్‌ ఉంచాలని, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ద్వారా ఇచ్చిన వ్యవసాయ యంత్ర సామాగ్రి అంతా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై సిఎం సమీక్ష నిర్వహించారు. భూసార పరీక్షలు చేసే వారు ప్రతి ఆర్‌బికెలో ఉండాలని తెలిపారు. దీనివల్ల ఏ ఏరువులు వాడాలి, ఎంతమేర వాడాలను అంశంపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ సందర్భగా ఇండియా అగ్రిబిజినెస్‌ అవార్డులు అందిస్తును ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ విత్తన కేటగిరీలో అవార్డు గెలుచుకున్న ఎపి స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను సిఎం అభినందించారు. ఈ సమావేశంలో మంత్రులు కాకాని గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, సిఎస్‌ సమీర్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, అధికారులు చిరంజీవి చౌదరి ప్రద్యుము, ఎన్‌.గుల్జార్‌ పాల్గొన్నారు.