న్యూఢిల్లీ : భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకు హర్యానాలో రైతు సంఘాలు మంగళవారం ఓ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులతో రెండు దఫాల చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితమూ లేదు. పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి ) కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కురుక్షేత్ర జిల్లాలోని పిప్లీ గ్రామంలో జాతీయ రహదారి 44ను దిగ్భందించిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి జిల్లా అధికారులతో రెండు సార్లు చర్చలు జరిపామని, అయితే చర్చలతో ఎలాంటి పురోగతి లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేష్ తికాయత్ పేర్కొన్నారు. స్థానిక రైతుల కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు మంగళవారం సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక కమిటీని సోమవారం ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పొద్దుతిరుగుడు పంటకు ఎంఎస్‌పి అంశం కేవలం హర్యానా రైతులను మాత్రమే ప్రభావితం చేయడం లేదని... ఇది రైతు వర్గానికి మొత్తాన్ని ప్రభావితం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తాము కిసాన్ ఆందోళన (నల్లచట్టాలను రద్దు చేయాలంటూ గతంలో రైతులు ఢిల్లీలో చేపట్టిన ఆందోళన) ఉపసంహరించుకున్పప్పుడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పంటలకు ఎంఎస్‌పి చట్టాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల షాహాబాద్‌లో అరెస్ట్ చేసిన తొమ్మిది మంది రైతుల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.










