Nov 15,2023 11:06

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఆయిల్‌ పామ్‌ ధర నేలను తాకింది. తాజాగా టన్ను ధర రూ.11,977కు దిగజారింది. గతంలో లాభాలు పంట పండించిన ఆయిల్‌పామ్‌ ఏడాదిగా నష్టాల బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం పామోయిల్‌పై దిగుమతి సుంకం రద్దు చేసింది. దీంతో, వంట నూనెలను ఉత్పత్తి చేసే సంస్థలు ఇతర దేశాల నుంచి ఆయిల్‌పామ్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. ఫలితంగా ధరలు నానాటికీ పతనమవుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో టన్ను రూ.12,951 ఉన్న ధర అక్టోబరు నాటికి రూ.12,122కు తగ్గింది. తాజాగా ఇది రూ.11,977కు దిగజారింది. ఇదే ధర కొనసాగితే ఎకరాకు రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు నష్టపోతామని సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాల్లో 40,826 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. అత్యధికంగా నల్లజర్లలో 10,490 ఎకరాల్లో సాగు జరుగుతుండగా, కడియం మండలంలో అత్యల్పంగా 3 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ పెట్టుబడి అవుతోంది. మొదటి కోత వచ్చే సరికి మూడు నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది. అంతవరకూ దీనికి రైతులు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. టన్నుకు కనీసం రూ.20 వేలు ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని వారు చెప్తున్నారు. జిల్లాలో పండిన ఆయిల్‌పామ్‌ గెలలను గానుగ ఆడించి, ముడి చమురును పెద్దాపురం, నల్లజర్లలోని ఎర్నగూడెంలో మిల్లులకు తరలిస్తుంటారు. ఆయా మిల్లుల్లో ప్రతి నెలా సగటు ముడి చమురు నిష్పత్తి (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో-ఒఇఆర్‌) ఆధారంగా అధికారులు, వ్యాపారుల కమిటీ ధర నిర్ణయిస్తుంది. ధరల పతనానికి కేేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని రైతులు, రైతు సంఘాలు చెబుతున్నారు. 2022 మేలో టన్నుకు రూ.23,665 ధర పలికింది. 2023 జనవరిలో రూ.17 వేలకు తగ్గిపోయింది. ప్రస్తుతం మరింత పతనమై రూ.11,977కు దిగజారడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగుకు గతంలో ప్రోత్సాహకాలు అందించేవి. దీంతో, 2020 నుంచి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆయిల్‌పామ్‌ సాగుకు నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ పథకం ద్వారా రైతులకు నేరుగా వారి ఖాతాల్లో రాయితీ సొమ్ము జమయ్యేది. ఈ పథకం ద్వారా ఇచ్చే సొమ్ములో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించేవి. గతేడాది మొక్కలు నాటిన రైతులకు రాయితీ డబ్బులు అందలేదు. దీంతో, వారిలో నిరాశ మొదలైంది. కొత్తగా సాగు ప్రారంభించిన వారిని పెట్టుబడి భారం వెంటాడుతోంది.
 

                                                                      ప్రభుత్వం ఆదుకోవాలి

ఆయిల్‌ పామ్‌ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో ప్రభుత్వ ప్రోత్సాహకం అందజేయడం, ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఆయిల్‌పామ్‌ సాగు ప్రారంభించాం. ప్రస్తుతం టన్ను రూ.11,977 చొప్పున కొనుగోలు జరుగుతోంది. ఓ వైపు దిగుబడులు తగ్గిపోవడం, మరోవైపు ధర గిట్టుబాటు కాకపోవడంతో ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ నష్టం వాటిల్లుతోంది.
-పాతూరి సత్యనారాయణ, పామాయిల్‌ రైతు, అచ్చెన్నపాలెం, నల్లజర్ల మండలం