Oct 25,2023 20:53
  • జలమండలి ఎస్‌ఇ కార్యాలయం ముందు రైతుల ధర్నా

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : కర్నూలు రూరల్‌ మండలం పడిదెంపాడు పంట పొలాలకు తక్షణమే నీళ్లివ్వాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలు జలమండలి ఎస్‌ఇ కార్యాలయం ముందు రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రైతులు ధర్నా చేపట్టారు. అనేకసార్లు డిఇకి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు. సత్వరమే న్యాయం చేయాలని ఎస్‌ఇకి విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వేసే పంటలు సరిగా దిగుబడి రాక ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కరువు ఛాయలు అలుముకున్నాయని, ఇటువంటి పరిస్థితులలో కాలువల కింద, బోర్ల కింద వేసిన పంటలను ప్రభుత్వాధికారులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పడిదెంపాడు రైతులు వంకాయ, టమాట, ఉల్లి, క్యాలీఫ్లవర్‌ అనేక రకాల కూరగాయలు సాగు చేశారని తెలిపారు. అవి ఇప్పుడు కోతకు వచ్చాయని, ఈ పరిస్థితులలో నీళ్లు లేకపోతే పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోతారని అన్నారు. వారంతా సన్న చిన్నకారు, కౌలు రైతులేనని తక్షణమే ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుండి లేదా సుంకేసుల నుండి ఈ ప్రాంతంలోని పొలాలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో రూ.లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు అప్పులపాలై నష్టపోతారని తెలిపారు. స్పందించిన ఎస్‌ఇ రెడ్డిగారి శేఖర్‌ రెడ్డి సంబంధిత ఇంజనీర్లు, డిఇలను చాంబరుకు పిలిపించారు. అల్లూరు దగ్గర ఉన్న పంపును, పడిదెంపాడు దగ్గర పంపును వెంటనే మరమ్మతులు చేసి పడదంపాడు రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం కర్నూలు మండలం కార్యదర్శి మృత్యుంజయ, రైతులు శ్రీనివాసులు, నాగరాజు, రాజులు, అయ్యన్న, శ్రీరాములు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.