Oct 24,2020 16:16

విజయవాడ : ఎస్‌పిఎం పేపర్‌ కంపెనీ సుబాబుల్‌ బకాయిలను వెంటనే రైతుల అకౌంట్లలో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేషన్‌ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు సహకారంతో కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ త్వరలోనే సుబాబుల్‌ రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి.ఆంజనేయులు మాట్లాడుతూ.. 2014 నుండి సుబాబుల్‌ రైతులకు రావాల్సిన బకాయిలను ఇవ్వటంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం మొత్తం బకాయిలలో 63 శాతం మాత్రమే ఇచ్చిందని, 13 శాతం ఎస్‌పిఎం పేపర్‌ కంపెనీ వారు రైతులు అకౌంట్లో జమ చేశారని, మిగిలిన 23 శాతం ప్రస్తుత ప్రభుత్వం 2 నెలల క్రితం కలెక్టర్‌ ఎకౌంట్లో వేశారని, కానీ రైతులకు మాత్రం ఇప్పటి వరకూ ఇవ్వలేదని తెలిపారు. ఒకవైపు వరదలు, వర్షాల వల్ల రైతులు పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాల్లో ఉంటే.. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎస్‌పిఎం పేపర్‌ కంపెనీ బకాయిలను విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. వెంటనే రైతుల అకౌంట్లో జమ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బాధిత సుబాబుల్‌ రైతులు చనుమోలు సైదులు, ఎర్ర శ్రీనివాసరావు, పాలేటి పూర్ణయ్య, పోపూరి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.