Nov 02,2023 08:26

కరువు మండలాలను ప్రకటించకపోవడంపై నిరసన
ప్రజాశక్తి - కడప అర్బన్‌ :రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 103 కరువు మండలాల్లో కడప జిల్లా నుంచి ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఎపి రైతు సంఘం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప పాత బస్టాండ్‌ దగ్గర చేపట్టిన నిరసననుద్దేశించి ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. దస్తగిరిరెడ్డి మాట్లాడారు. జిల్లాలోని 36 మండలాలలో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసేనాటికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయని, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి కరువు మండలాలను ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, జిల్లా నాయకులు రంగారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.