Jul 20,2023 21:50

ప్రజాశక్తి - జామి, బబ్బిలి (విజయనగరం) :భీమసింగి సహకార చక్కెర పరిశ్రమను తక్షణమే తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన గురువారం రైతులు ధర్నా చేశారు. ఫ్యాక్టరీకి ప్రభుత్వం నిధులు కేటాయించాలని, ఈ ప్రాంత చెరకు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు మాట్లాడుతూ.. జాతీయ వ్యవసాయ కమిషన్‌ సిఫార్సు చేసిన విధంగా టన్నుకు రూ.5 వేలు మద్దతు ధర ఇవ్వాలని, సహకార పరిశ్రమల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని 29 చెరకు ఫ్యాక్టరీల్లో 24 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, 11 సహకార పరిశ్రమల్లో ఒక్క గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మాత్రమే నడుస్తోందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్‌, చెరరకు రైతు సంఘం ఫ్యాక్టరీ కమిటీ కార్యదర్శి చలుమురి వెంకటరావు తదితరులు పాల్గోన్నారు

  • ఎన్‌పిఎస్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ఎన్‌పిఎస్‌ చక్కెర పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని క్రషింగ్‌ చేయాలని రైతు సంఘం, చెరకు రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డిప్యూటీ షుగర్‌కేన్‌ కమిషనర్‌ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెరకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.గోపాలం మాట్లాడారు. లచ్చయ్యపేట, భీమసింగి చక్కెర పరిశ్రమలు మూత పడడంతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంకిలికి చెరకు తరలించడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. భీమసింగి చక్కెర పరిశ్రమ తెరిచే పరిస్థితి లేదని, ఎన్‌పిఎస్‌ చక్కెర పరిశ్రమ కేసు కోర్టులో ఉందని సత్యనారాయణ అన్నారు. సంకిలి చక్కెర పరిశ్రమకు చెరకు తరలిస్తామని, రవాణా ఛార్జీలపై యాజమాన్యంతో చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు.