Sep 19,2023 21:36

-3న మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు
- ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :లఖింపూర్‌ ఖేరీ ఘటనకు బాధ్యులైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరుమిశ్రాను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని, రైతుపై కాల్పులు జరిపి వాహనాలతో తొక్కించి చంపిన ఆశిష్‌ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్‌ చేసింది. అక్టోబరు 3న మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయాలని, నవంబరు 26, 27, 28 తేదీల్లో రాజ్‌భవన్‌ ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. విజయవాడలోని గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, ఎపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. లఖింపూర్‌ ఖేరీ ఘటన జరిగి ఏడాదవుతున్నా.. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా అక్టోబరు 3న బ్లాక్‌డేగా పాటించనున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు అమలు చేయలేదని, దేశాభివృద్ధికి దోహదపడే అంశాలు కాకుండా దేశ వినాశనానికి పనికొచ్చే విధానాలు అవలంభిస్తోందని వారు విమర్శించారు. మోడీ పాలనలో నిరుద్యోగం తాండవిస్తోందని, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకురావడం దారుణమన్నారు. సామాన్యులకు ఎటువంటి మేలు జరగకపోగా, దేశ సంపదను కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం దోచిపెడుతోందన్నారు. మీడియా సమావేశంలో ఆలిండియా కిసాన్‌ మోర్చా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై కేశవరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్ర నరేంద్రరెెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జమలయ్య, తెలుగు రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు కల్లం రాజశేఖర్‌రెడ్డి, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు, ఎంకెఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, కిసాన్‌ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.