Jul 17,2022 06:38

ఆర్థిక సంక్షోభాలు, సమస్యలపై సమ్మెలూ, వరద ముప్పు వేళలోనూ ఎన్నికలే ఎజెండా అయినట్టు పార్టీలు ప్రవర్తిస్తుంటే మీడియా చర్చలన్నీ ఆ వైపే. పార్టీలు గెలుస్తామని చెప్పుకోవడంలో వింతేమీ లేదు గానీ దేశం ముందు రాష్ట్రాల ముందూ వున్న సమస్యలు పక్కనపెట్టి అధికారం చుట్టూనే ప్రదక్షిణలు చేయడం, తమకు తామే విజేతలైపోయినట్టు ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

వచ్చే ఎన్నికల్లో శాసనసభ లోని 175 స్థానాలు తెచ్చుకుంటామని వైఎస్‌ఆర్‌సిపి హడావుడి చేస్తున్నది. తెలుగుదేశం నాయకులు తామే గెలిచిపోయినట్టు చెబుతున్నారు. జనసేనాధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు. బిజెపిదీ ఇదే పాట. ఇక తెలంగాణలో హ్యాట్రిక్‌ సాధిస్తామని, దక్షిణాదిన ఎన్నడూ లేనివిధంగా కెసిఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని కెటిఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానితో సహా బిజెపి నాయకులంతా విచ్చేసి తమ సర్కారే వస్తుందన్నారు. కాలూచేయి కూడదీసుకుంటున్న టికాంగ్రెస్‌ వచ్చేది తామేనంటోంది. ఈ పోటాపోటీ ఆశల మధ్య సర్వేలు, అభిప్రాయ సేకరణలు వెలువడుతున్నాయి. ఆర్థిక సంక్షోభాలు, సమస్యలపై సమ్మెలూ, వరద ముప్పు వేళలోనూ ఎన్నికలే ఎజెండా అయినట్టు పార్టీలు ప్రవర్తిస్తుంటే మీడియా చర్చలన్నీ ఆ వైపే. పార్టీలు గెలుస్తామని చెప్పుకోవడంలో వింతేమీ లేదు గానీ దేశం ముందు, రాష్ట్రాల ముందూ వున్న సమస్యలు పక్కనపెట్టి అధికారం చుట్టూనే ప్రదక్షిణలు చేయడం, తమకు తామే విజేతలైపోయినట్టు ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. టిఆర్‌ఎస్‌, వామపక్షాలను మినహాయిస్తే మిగిలిన పార్టీలకు (చాలా వరకూ టికాంగ్రెస్‌కు కూడా) బిజెపి ప్రధాన సమస్య కాలేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము రాక సందర్భంగా బిజెపికి దగ్గరవడంలో టిడిపి వైసీపీ ఎవరు ఎక్కువ ప్రాధాన్యత పొందారని కథనాలు నడిచాయి.
ఎ.పి, తెలంగాణ సర్వేల సారాంశం
            వైసీపీ ప్లీనరీ రాష్ట్ర భవిష్యత్తుకు దశ, దిశ చూపిస్తుందని నాయకులు చెప్పారు. కానీ జరిగిందంతా జగన్నామ స్మరణే. జగనే సత్యం, మంత్రులూ ఎంఎల్‌ఎలు మిథ్య అన్నట్టు మాట్లాడారు. జగన్‌ భజన, సంక్షేమ పథకాల గొప్పలు, వ్యతిరేక రాజకీయ శక్తులపై దాడి, విజయమ్మ రాజీనామా-జగన్‌కు జీవితకాల అధ్యక్ష పదవి, 175 స్థానాలూ తెచ్చుకోవడం. అయిదే అంశాలు: తీర్మానాలు అంటున్నా భజనతో కలిపి 10.15 నిముషాలకన్నా మాట్లాడింది లేదు. మూడు రాజధానుల మాట మానిందీ లేదు. బిజెపి సమావేశాలు, వైసీపీ సమావేశాల నేపథ్యంలో మొదలైంది సర్వేల సందడి. ఎస్‌ఎఎస్‌ గ్రూపుగా పేరు మార్చుకున్న ఆత్మసాక్షి ఎంఎల్‌ఎల గడప గడప సందర్భంలో అభిప్రాయ సేకరణ విడుదల చేసింది. వైసీపీకి 75-77, టిడిపికి 60-62, జనసేన 6-7, ఇతరులకు 1 వస్తాయని అంచనా వేసింది. 18-23 తీవ్ర పోటీ అన్నది. అదే సంస్థ తెలంగాణపై జరిపిన సర్వే లోనూ టిఆర్‌ఎస్‌కు 56-59 స్థానాలు వస్తాయని, మజ్లిస్‌కు ఏడు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్‌ 37-39 స్థానాలతో రెండో స్థానంలో వుంటుందని, బిజెపి 14-16తో మూడో స్థానానికే పరిమితమనీ పేర్కొంది. మరో సంస్థ ఆరా కూడా మీడియా గోష్టి జరిపి మరీ ప్రకటించిన సర్వేలో టిఆర్‌ఎస్‌కు ఓటింగు 46 నుంచి 38.88 శాతానికి తగ్గినట్టు బిజెపికి 23 నుంచి 30.48 శాతానికి పెరిగినట్టు చెప్పింది. కాంగ్రెస్‌కు 23.71, ఇతరులకు 6.93 ఓట్లు చూపించారు. ఆరా అధినేత మస్తాన్‌రావు గతంలో బిజెపి, ఎబివిపిలతో సంబంధం కలిగిన వారు గనక వారిని పెంచి చూపినట్టు కాంగ్రెస్‌ ఎదురుదాడి చేసింది. టీవీ చానల్‌ చర్చలో మస్తాన్‌ తన గత అనుబంధం ఒప్పుకున్నారు. టిఆర్‌ఎస్‌ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అధ్యయనం మేరకు అనుకూల అంచనాలు అందాయని ప్రకటిం చింది. ఒకటి బిజెపికి, ఒకటి కాంగ్రెస్‌కు అనుకూలమైన రెండు సర్వేలు తమకే ప్రథమ స్థానం ఇచ్చాయి గనక కెసిఆర్‌ హ్యాట్రిక్‌ సిఎం అవుతారని కెటిఆర్‌ వ్యాఖ్యానించారు.
         ప్లీనరీ తర్వాత సిఎన్‌వోఎస్‌ సంస్థ జరిపిన అభిప్రాయ సేకరణ జగన్‌ జనాదరణ బాగా తగ్గినట్టు ముఖ్యమంత్రుల జాబితాలో 20వ స్థానంలో వున్నట్టు పేర్కొన్నది. ఆయనకు 39 శాతం అనుకూలంగా 29 శాతం వ్యతిరేకంగా వుంటే 32 శాతం ఎటూ చెప్పలేదట (కెసిఆర్‌ 9వ స్థానంలో వున్నారు). మోడీ పట్ల ఆదరణ 55 శాతానికి పెరిగిందన్నారు. నవీన్‌ పట్నాయక్‌ మొదటి స్థానంలోనూ యోగి ఆదిత్యనాథ్‌ రెండో స్థానంలోనూ రాజీనామా చేసిన ఉద్ధవ్‌ థాక్రే మూడో స్థానంలోనూ వున్నట్టు పేర్కొంది. మొత్తంమీద ఇందులో బిజెపి దాని మిత్రులను పైకి లేపడం కనిపిస్తుంది. ఈ సర్వే రాగానే వైసీపీ నేతలు ఇది టిడిపి చేయించిందని, చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్న వ్యూహకర్త రాబిన్‌ శర్మ వెనక వున్నారని ఎదురుదాడి మొదలెట్టారు. శర్మ ఫిబ్రవరి వరకే వున్నారని, తనకూ సిఎన్‌వోఎస్‌కు సంబంధం లేదనీ టిడిపి వాదన. సంస్థల ప్రత్యక్ష పరోక్ష సంబంధాలే గాక ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్న పరిస్థితులలో ఈ వివాదాలు తెగేవి కావు. ప్రశాంత్‌ కిశోర్‌ నేరుగా రాజకీయ పార్టీల్లో చేరడం, సెఫాలజిస్టు జీవీఎల్‌ నరసింహారావు బిజెపి ఎంపిగా మారడం చూశాం.
పెద్ద తేడా ఏమిటి?
             జగన్‌ ప్రజాదరణ 40 శాతానికి అటూఇటుగా వున్నట్టు జనవరిలో ఇండియా టుడే సర్వేలోనూ వచ్చింది. పికె బృందం వైసీపీ తరపున నిర్వహించిన ఏప్రిల్‌ సర్వేలోనూ జగన్‌కు 65 శాతం పైన ఆదరణ వున్నట్టు చెప్పినా ఎక్కువమంది ఎంఎల్‌ఎలు 40-45 శాతం డగ్గరేవున్నారు. వారిని ఆయన గట్టిగా హెచ్చరించినట్టు కూడా చూశాం. ఇప్పుడు 39 శాతం అనుకూలం, 32 శాతం తటస్థం అంటే దాదాపు అంతే. పెద్ద తేడా ఏం లేదు. క్షేత్ర స్థాయిలో ధరలు, పన్నుల పెరుగుదల కోర్టులలో మొట్టికాయలు, అప్పులు, సంక్షేమ పథకాలలో వడపోత, విద్యారంగంలో సవాళ్లు, ఉద్యోగులు కార్మికుల ఆందోళనలు నిర్బంధాలు చూస్తూనే వున్నాం. నవరత్నాలొక్కటే సమగ్రాభివృద్ధికి దారితీయదు. ప్లీనరీలోనూ వారు ఆవిష్కరించిన ప్రణాళిక ఏమీ లేదు. ఎంఎల్‌ఎలనూ మంత్రులనూ మందలించి అప్రమత్తం చేసే ముఖ్యమంత్రి మొత్తంగా తన పాలన తీరును సమీక్షించుకోవడం, సరిదిద్దుకోవడం జరక్కపోతే ఇది మరింత పెరగొచ్చు. ప్రధాన ప్రతిపక్షం రాజకీయ వివాదాలు, వ్యక్తిగత అంశాలపై కేంద్రీకరించడం జరిగినా అంతిమంగా పనిచేసేది ప్రజల జీవిత సమస్యలే. ఈ సర్వేలలో కూడా సమస్యలపై అడిగినట్టు చెబుతుంటారు. సర్వేలతో ప్రజలను ప్రభావితం చేయడం మోడీ హయాంలో మరింత పెరిగింది. అవి విఫలమవడం సఫలమవడం కూడా చూశాం. దీనికి పరాకాష్ట ఆంధ్రా ఆక్టోపస్‌ అని ప్రచారం పొందిన మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ ప్రహసనమే. ప్రజాస్వామ్యంలో వాటిని సంకేతాలుగా తీసుకుని తప్పులు దిద్దుకోవాలిగాని ఎదురుదాడి ఉపయోగం ఏమిటి?
         దీంతోపాటు ముందస్తు ఎన్నికల ముచ్చట హోరెత్తుతున్నది. తెలంగాణలో 2018లో ముందే ఎన్నికలు జరిగాయి. లోక్‌సభతో సంబంధం లేకుండా కెసిఆర్‌ వ్యూహం అందుకు కారణం. ఇప్పుడు కూడా అధాటున ఎన్నికలు ప్రకటించి కెసిఆర్‌ ప్రతిపక్షాలను దెబ్బతీస్తారని ప్రచారం సాగుతోంది. బిజెపి నేతలైతే వెంటనే ఎన్నికలు పెట్టు అని సవాళ్లు విసురుతున్నారు. లోక్‌సభ రద్దు చేసి ఎన్నికలకు వెళితే మేమూ రెడీ అంటోంది టిఆర్‌ఎస్‌. ఎ.పి లో ముందస్తు వుండదని మొన్న ప్లీనరీలో వైసీపీ వారు ఖండించారు. అయినా సిఎం ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతున్నారు. అంటే రెండేళ్లు వచ్చే ఎన్నికల సన్నాహాలలోనే మనిగితేలతారా? చంద్రబాబు కూడా ఇప్పటికే జిల్లాలు పర్యటిస్తూ ఎన్నికలు, అభ్యర్థులు, ఇన్‌ఛార్జిలు మాట్లాడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఎంజిఆర్‌ తరహాలో కొన్ని దానధర్మాలు చేస్తూ రాజకీయాలు జోడిస్తున్నారు. ఈ మూడు పార్టీలు పరస్పర దూషణలు తప్ప కేంద్రాన్ని ప్రశ్నించడం మాత్రం జరగదు. కెసిఆర్‌ బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా ఎవరితో కలసి ఏమేరకు పనిచేస్తారనేది ప్రశ్నార్థకమే. హ్యాట్రిక్‌ స్వప్నం నిజం కావాలంటే టిఆర్‌ఎస్‌ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం చాలా వుంటుంది.

                                                            తెలకపల్లి రవి    తెలకపల్లి రవి