Nov 20,2023 12:06

 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమే ధ్యేయం : విజయ్ రాఘవన్‌


ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ప్రజా సమస్యలే అజెండాగా సిపిఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపి విజరురాఘవన్‌ తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికలకు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమే ధ్యేయంగా తమ పార్టీ ముందుకెళ్తోందని చెప్పారు. బిజెపి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తోందని, రాజ్యాంగేతర శక్తిగా మారిందని విమర్శించారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బిజెపిని ఓడించే ప్రజాస్వామ్య శక్తులకు మద్దతు ఇస్తూనే తాము బలంగా ఉన్న 19 స్థానాల్లో పోటీ చేస్తున్నామని వివరించారు. సిపిఐకి ఒక సీటులో మద్దతు ఉందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం లౌకిక, ప్రజాస్వామ్య విలువలను విడనాడిందని, రాజ్యాంగేతర శక్తిగా మారిందని విమర్శించారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉండాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. బిజెపి పాలనలో దళితులు, కార్మికులు, కర్షకులపై భారాలు అధికమయ్యాయని, అన్ని తరగతుల ప్రజలూ సంకటస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్య, వైద్యం ప్రయివేట్‌పరం అయ్యాయని తెలిపారు. కానీ, కేరళలో ఈ రెండూ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని వివరించారు. కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ విధానాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కమ్యూనిస్టులు పోటీ చేస్తున్న 20 స్థానాల్లో బిజెపి, బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను ఓడించాలని కోరారు. ఈ ఎన్నికలు అఖిలభారత స్థాయిలో ప్రభావితం చూపుతాయన్నారు. తెలంగాణలో 17 శాతంగా ఉన్న దళితుల్లో 60 శాతం మందికి భూమిలేదని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. బిజెపి బిసి ముఖ్యమంత్రి అంటుందే తప్ప, బిసిల సమస్యలపై ఆ పార్టీకి ఏ మాత్రమూ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సమావేశంలో సిపిఎం జాతీయ నాయకులు ఎం.సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేశ్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు.