Dec 10,2020 06:46

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర భూ సర్వే కార్యక్రమంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిని తీర్చి ముందుకు వెళాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా ఏకపక్షంగా సాగుతుండటం ఆందోళనకరం. రాష్ట్రమంతా మారు మూల గ్రామాల వరకు సర్వే చేసి భూమిపై యాజమాన్య హక్కులను ధృవీకరించడం, పట్టాలు ఇవ్వడం, ఎవ్వరూ ట్యాంపరింగ్‌ చేయడానికి వీలు లేకుండా కొత్త రికార్డులు రూపొందించి, భద్రపరచడం ఈ సర్వే లక్ష్యం. అంటే భవిష్యత్తులో జరగబోయే భూ లావాదేవీలన్నింటికి ఈ సర్వేతో రూపొందించిన రికార్డులు ఆధారం కానున్నాయి. అదే సమయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా యాజమాన్య హక్కులు మారిపోయి కొత్త వివాదాలకు దారి తీసే ప్రమాదమూ ఉంది. ఇంత కీలకమైన ప్రక్రియలో ప్రజా భాగస్వామ్యానికి ఎంత ప్రాధాన్యత ఉండాలి ? వారి అభిప్రాయాలకూ, సూచనలకు ఎంత విలువ ఇవ్వాలి? కానీ, ప్రభుత్వానికి ఇదేమి పడుతున్నట్టు లేదు. ఉపగ్రహాలు, డ్రోన్‌లు వంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం మంచిదే! వీటివల్ల మరింత కచ్చితత్వాన్ని సాధించవచ్చు! కానీ, దానికి ప్రాతిపదిక ఏమిటి? ఎక్కడ నుండి వస్తుంది? అవే హద్దులు నిర్ధారిస్తాయన్నట్లుగా మాట్లాడితే ఎలా?


ఎప్పుడో బ్రిటిష్‌ పాలనలో 1900 సంవత్సరంలో సర్వే, ల్యాండ్‌ రెవిన్యూ డిపార్టుమెంట్లను ఏర్పాటు చేసి కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సర్వే నిర్వహించారు. అది పూర్తికావడానికి 60 నుండి 70 సంవత్సరాల సమయం పట్టినట్టు సిసిఎల్‌ఎ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. 1971లో ఆ శాఖను పునర్‌వ్యవస్థీకరించారు. భూ రికార్డుల నిర్వహణతో పాటు ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు 1949లో సర్వే సెటిల్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో రూపొందించిన సర్వే మ్యాన్యువల్‌ ప్రకారం ప్రతి 40 సంవత్సరాలకు రీ సర్వే చేసి రికార్డులను నవీకరించుకోవాలి. సిబ్బంది కొరత, సమయం, వ్యయం ఎక్కువ అవుతుండటం వంటి కారణాలతో రీ సర్వే ప్రక్రియను సక్రమంగా నిర్వహించలేదు. ఫలితంగా అనేక గ్రామాలకు సంబంధించిన రికార్డులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని, అనేకం పోవడమో, చిరిగిపోవడమో జరిగాయని, చాలా రికార్డుల్లో అక్షరాలు కనపడకుండా శిధిలావస్థలో ఉన్నాయని సిసిఎల్‌ఎ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. దాదాపుగా వంద సంవత్సరాల క్రితం జరిగిన ఆ సర్వే పూర్తి ఏకపక్షంగా సాగింది, విస్తృత ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేయలేదు. జమీందార్లు, భూ స్వాముల కనుసన్నలో అప్పట్లో సర్వే జరిగిందని ఆర్థికరంగ సంస్కరణల కోసం 2009లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పేర్కొంది. ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తామంటే ఎలా? ప్రస్తుతమున్న పద్ధతికి బదులుగా యాజమాన్యపు హక్కుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే టైటిల్‌ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని కూడా ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డులు, ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. మన రాష్ట్రంలోనూ కొన్ని సంవత్సరాల నుండి ఆ దిశలో కార్యాచరణ ప్రారంభమైంది. గత ప్రభుత్వం చేపట్టిన 'మీ భూమి' వంటి కార్యక్రమాలు దానిలో భాగమే!


అయితే, కీలకమైన సర్వే ప్రక్రియ దీనికి భిన్నం! భూమిని ఎగరేసుకుపోవడానికి సిద్ధంగా ఉన్న వారు కొందరైతే, తరాల తరబడి సాగు చేస్తూ అనుభవిస్తున్నా తమ మధ్య జరిగిన పంపకాలు రికార్డుల్లో నమోదు కానివారు, దశాబ్దాలుగా సాగు చేస్తున్నా రికార్డు ప్రకారం ఏమాత్రం హక్కు లేని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూముల అంశాలను కూడా పరిష్కరించాల్సి ఉంది. మా దగ్గరున్న సమాచారం ప్రకారం యాజమాన్యాన్ని నిర్ధారిస్తాం, గ్రామ సచివాలయాల్లో ప్రకటిస్తాం, అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంటే 'తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి' అన్న విధంగానే తయారవుతుంది. క్షేత్ర స్థాయిలో అధికార పార్టీ నాయకులదో, స్థానికంగా బలమున్న మోతుబరులదో ఇష్టారాజ్యమవుతుంది. దీనిని నివారించాలంటే గ్రామసభలను, వార్డు సభలను నిర్వహించి స్థానికుల నుండి వివరాలు సేకరించాలి. సర్వే ప్రారంభ దశ లోనే ప్రజలను భాగస్వాములను చేయాలి. సర్వే ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి కావాలి.అప్పుడే ఇది ప్రయోజనాన్ని సాధిస్తుంది.