Jul 15,2023 13:09

ప్రజాశక్తి - బుచ్చయ్యపేట (అనకాపల్లి) : మండలంలో సమగ్ర భూసర్వే తప్పులు తొడకగా ఉందని జిల్లా పేద ప్రజల హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్‌ ఆకుల నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మొదట విడతగా 15 రెవిన్యూ గ్రామాల్లో రీ సర్వే జరిపి పట్టాదార్‌ పాసు పుస్తకాలు రైతులకు అందజేశారన్నారు. చాలా గ్రామాల్లో సాగుబడి ఒకరి పేరుమీద పాస్‌ బుక్స్‌ మరొకరు పేరు మీద ఇచ్చారన్నారు. భూములు విస్తీర్ణంతోపాటు యజమానులు పేర్లు ఫొటోలు కూడా మార్పులు చేర్పులు జరిగాయన్నారు. ఈ సమస్యలు వలన భూమి సాగుదార్లు మధ్య ఘర్షణలు, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. పెదపూడి రెవిన్యూలో రీసర్వే అక్రమార్కులకు అనుకూలంగా ఉందన్నారు. పెదపూడిలో స్థానికేతరులకు ప్రభుత్వ భూములలో పట్టాలిచ్చారని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. యధావిధిగా పరవాడలో నివాసం ఉంటున్న కొందరి అనర్హుల పేర్లు రీసర్వేలో మళ్లీ నమోదు చేశారన్నారు. సర్వేలో తప్పులు సవరించాలని, భూ యజమాని సమక్షంలోనే సర్వే నిర్వహించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. తప్పులు సవరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.