- రాష్ట్రానికి హక్కు లేదనడం రాజ్యాంగ ఉల్లంఘన
- అమరావతిలోనే ఉండాలని ఎలా చెబుతారు
- హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వండి
- పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర రాజధాని అంశం సుప్రీంకోర్టుకు చేరింది. అమరావతిలోనే రాజధానిని నిర్మించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆరునెలల తరువాత దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో హైకోర్టు తీర్పులోని అనేక అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తుతూ స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. మూడు రాజధానుల ప్రణాళికను సమీక్షించి, రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ మార్చి 3వ తేదిన హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా పిటిషన్‌లో రాష్ట్రానికి రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని హైకోర్టు చెప్పడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మహఫూజ్ నజ్కీ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు ఇచ్చే సమయానికే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, కొత్త చట్టాన్ని తీసుకువస్తామని చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషన్‌లో తెలిపారు. అమరావతి (లెజిస్లేటివ్), విశాఖపట్నం (ఎగ్జిక్యూటివ్), కర్నూలు (న్యాయ) మూడు రాజధానుల అభివృద్ధికి ఏపి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివఅద్ధి రద్దు బిల్లును రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో సమాఖ్య నిర్మాణం ప్రకారం ప్రతి రాష్ట్రం తన రాజధాని విధులను ఎక్కడ నుండి నిర్వహించాలో నిర్ణయించుకునే హక్కును కలిగిఉందని తెలిపారు. రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పడం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనని వాదించారు. ఈ తీర్పు అధికార విభజన సిద్ధాంతాన్ని ఉల్లంఘిస్తుందని, చట్టం చేయకుండా శాసనసభను నియంత్రిస్తుందని పేర్కొన్నారు.
- ఇప్పటికే కేవియట్‌లు దాఖలు
అయితే, ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించిన అమరావతి రైతులు సుప్రీంకోర్టులో రెండు కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే ఎటువంటి పిటిషన్‌పైనైనా తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇయ్యవద్దని ఈ పిటిషన్లలో కోరారు. న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, యలమంచలి శివసంతోష్ రైతుల తరపున ఈ పిటీషన్లు దాఖలు చేశారు.
- పదే పదే మొట్టికాయలు వేసినా : రామకృష్ణ
రాష్ట్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై కోర్టులు పదేపదే మొట్టికాయలు వేసినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలోనే అమరావతిని ఎపి రాజధానిగా నిర్ణయిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిని మరచిపోయారా అని ప్రశ్నించారు. అమరావతిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని వివరించారు.
- ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయం : రవికాంత్
అమరావతిని రాజధానిగా ఉంచాలని, అయితే అభివృద్ధి చేయకుండా పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోందని ఎపిసిసి ప్రధాన కార్యదర్శి నూతలపాటి రవికాంత్ తెలిపారు. అన్ని రాజకీయపార్టీలూ అమరావతిలోనే రాజధాని ఉండాలని చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని అన్నారు. అసెంబ్లీలో అమరావతిని అంగీకరించి ఇప్పుడు కాదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోవాలని కోరారు.










