Jan 15,2021 21:20

పంటలు లేక ఎండిన ఉప్పు గల్లీలు

ప్రజాశక్తి - నౌపడ: ఒకప్పుడు ఎంతో వైభవాన్ని చవిచూసిన నౌపడ ఉప్పు పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. 'నవరుచుల తల్లి నౌపడ ఉప్పు గల్లీ' అనే నానుడి నేడు వినపడకుండా పోయింది. జిల్లాలోనే కాక రాష్ట్రంలోని చారిత్రాత్మక ఈ ఉప్పు పరిశ్రమ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజులు దాదాపుగా 80శాతం సెప్టెంబర్‌ 2018లోనే ముగియడంతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. లీజులు పునరుద్ధరించాలని ఈ ప్రాంత ఉత్పత్తిదారుల సంఘం నాయకులు పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు లీజులు రేటు కూడా టన్ను ఉప్పుపై రూ.100 వరకు పెంచడంతో(ప్రస్తుత ధర టన్ను రూ.100) రైతులపై ఆర్థిక భారం పడుతోంది.
సంతబొమ్మాళి మండలంలో నౌపడ, భావనపాడు, పెద్ద మర్రిపాడు, చిన్న మర్రిపాడు, శలగపేట, సీతానగరం, యామలపేట, మూలపేట, విష్ణు చక్రం, ఆర్‌.సున్నాపల్లి గ్రామాల పరిధిలో సుమారు 3500 ఎకరాలు ఉప్పు పంట ఏటా సాగయ్యేది. సుమారు 80వేల టన్నుల మేర దిగుబడి వచ్చేది. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఐదు వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు 80శాతం ఉప్పు భూముల లీజు కాలపరిమితి ముగియడంతో వీటినే నమ్ముకున్న కార్మికులు, రైతులు వలసబాట పడుతున్నారు. ఉపాధి లేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ ఉప్పు భూముల్లో సుమారు 1100 ఎకరాలు జిరాయితీ, మరో 2100 ఎకరాలు ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉంది. ఇందులో కొన్ని భూములకు 2027 వరకు లీజులు ఉండటంతో అక్కడక్కడ ఉప్పు పండిస్తున్నారు. వారు కూడా అకాల వర్షాలు, తుపానుల వల్ల నష్టాలబారిన పడుతున్నారు.
లీజులిస్తేనే మునుపటి శోభ
అకాల వర్షాలు, తుపానులతో నష్టపోయిన పరిశ్రమపై రైతులు అనాసక్తి కనబరుస్తున్నారు. ఈ పరిశ్రమపై అంతగా ఆదాయం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఉప్పు శాఖ కార్యాయాలు, సిబ్బందిని సైతం తగ్గించేసింది. ప్రకతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించి, లీజులు రెన్యువల్‌ చేస్తే నౌపడ పరిసర ప్రాంతాలలో వేలాది కుటుంబాలకు ఉపాధి పొంది, ఈ పరిశ్రమ మునుపటి శోభను సంతరించుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వెలవెలబోతున్న ఉప్పు మడులు
ఏటా డిసెంబర్‌ నుండి జూన్‌ వరకు ఉప్పును పండిస్తూ కళకళలాడుతూ ఉన్న ఉప్పు గల్లీలు జనవరి రెండో వారం వచ్చినా ఉప్పులేక కళా హీనంగా మారాయి. ఉప్పు గల్లీల్లో నీరులేక ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. తాతలు, తండ్రులు నుండి ఉప్పు పంటనే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న రైతులు, కార్మికులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం లీజులను ఈ టెండర్ల ద్వారా నిర్ణయిస్తారన్న నేపథ్యంలో ఎప్పుడు పునరుత్పాదకత(రెన్యువల్‌) చేస్తారో తెలియక ఉప్పును నమ్ముకుని ఉన్న రైతులు, కార్మికులు అయోమయంలో ఉన్నారు. అధునాతన పద్ధతులతో అయోడైజ్డ్‌ సాల్ట్‌ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా అది హామీలకే పరిమితమైంది.
వలస బాట పట్టిన కార్మికులు
ప్రధాన జీవనాధారం కోల్పోవడంతో ఉప్పు రైతులు, కార్మికులు ఉపాధి కోసం వలస పోతున్నారు. ఉప్పు పంట తప్ప మరే ఇతర ఉపాధి మార్గాలు లేక చెన్నై, హైదరాబాద్‌, బళ్లారి, విజయవాడ తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఉప్పు పంటను ప్రభుత్వ పంటగా గుర్తించకపోవడం, ఏటా తుపానులు, వర్షాల వల్ల ఉప్పు రైతులు, వాటిపై ఆధారపడిన కార్మికులు నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో అప్పుల ఊబిలో కూరుకున్న రైతన్నలకు, కార్మికులకు పూట గడవాలంటే వలసలే శరణ్యంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉప్పు భూములపై దష్టి సారించి లీజులు పునరుద్ధరణ చేయాలని, ఉపాధి మార్గాలు చూపించాలని పలువురు కోరుతున్నారు.