May 11,2023 07:48
  • విశాఖలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కొలువులపై నీలినీడలు...
  • తగ్గుతున్న ఉద్యోగ, ఉపాధి కల్పన

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి) రంగంలో కొలువు అంటే ఒకప్పుడు పెద్ద ఫ్యాషన్‌. వేల సంఖ్యలో కొలువులు. భారీగా వేతనాలు పొందేవారు. అలాంటి ఐటి రంగంలో నేడు కొలువుల జోరు మందగించింది. వేల సంఖ్యలో ఉద్యోగులు తమ పాత జీతాలతోనే రోజు కూలీల మాదిరి బతుకులీడ్చాల్సి వస్తోంది. మన రాష్ట్రంలో ఐటి హబ్‌గా పిలవబడే విశాఖలో ప్రస్తుత ఐటి రంగంలో ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. విశాఖపట్నం రుషికొండపైనే 40 కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో కొత్త ఉద్యోగుల కల్పనలేదు. ఉన్నవారికి వేతనాల్లో పెరుగుదల లేదు. ఇక్కడ 70 శాతం ఉద్యోగులు పొందుతున్న జీతాలు రూ.15 వేల నుంచి రూ.25 వేలలోపే ఉంటున్నాయి. అది కూడా వారు చదివిన ఐటి కోర్సులను బట్టే ఈ జీతం లెక్కకట్టి ఇస్తున్నారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన ''గ్లోబల్‌ సమ్మిట్‌ -2023లో రూ.32,944కోట్లతో 6 ఐటి, ఐటిఇఎస్‌ సంస్థల స్థాపనకు ప్రతిపాదనలు వచ్చినా క్షేత్రస్థాయిలో ఒక్క అదానీ డేటా సెంటర్‌కే పునాది రాయి పడింది. మిగతా 5 ప్రతిపాదనల్లో కదలిక లేదు.

  • గ్లోబల్‌ ఎఫెక్టూ ఒక కారణమే...?

గ్లోబల్‌ మాంద్యం ప్రభావం ఐటి రంగంపై ఏడాదిన్నర కాలంగా ఉంది. ఆపిల్‌, అమెజాన్‌, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలు పలువురు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌ సంస్థ పది వేల మందిని తొలగించింది. ఈ ప్రభావం జీతాలపైనా పడి ఐటి బతుకులు దినదినగండంగా మారాయి. ఐదేళ్ల క్రితమైతే ఈ వేతనాలు రూ.8 వేల నుంచి రూ.10 వేలే. కొన్ని కంపెనీలు ఇప్పటికీ రూ.10 వేలు జీతం ఇస్తున్నాయి. 2019 తర్వాత కొంత పెరుగుదల కనిపించి 2022 తర్వాత మరలా జీతాలు పడిపోయాయి. రుషికొండపై హిల్‌ నెం.1లో మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌, హిల్‌ నెం.2లో మౌరిటెక్‌, పల్సస్‌, పెన్నెట్‌, హిల్‌ నెం-3లో కాండ్యుయెంట్‌ సైంట్‌ వంటి ప్రసిద్ధ సంస్థలు నడుస్తున్నాయి. అత్యధిక నైపుణ్యం కలిగిన కొద్దిమందికి వీరిచ్చే అత్యధిక వేతనం రూ.50 వేల నుంచి రూ.60 వేలు మాత్రమే. ఇక్కడ కూడా పనిచేస్తున్న 70 శాతం మంది తీసుకుంటున్న వేతనాలు రూ.25 వేలు లోపే. బిగ్‌ ప్లేయర్‌ (ఐటి సంస్థ)లు అడుగుపెట్టకుండా ఐటి వేతనం రూ.లక్షకు దాటదన్నది ఐటి ప్రతినిధులు చెబుతున్నారు.

  • ఐటి హిల్స్‌...ఆక్యుపెన్సీ డల్‌..

విశాఖలో చెప్పుకోదగ్గ ఐటి కంపెనీలున్న ప్రాంతం రుషికొండ ఐటి హిల్స్‌. ఇక్కడ రెండు మిలీనియం టవర్స్‌ ఉన్నాయి. మొత్తంగా 18 ఫ్లోర్లకుగాను కేవలం నాలుగు ఫోర్లలోనే ఐటి కంపెనీలు నడుస్తున్నాయి. 14 ఫ్లోర్స్‌ ఖాళీగా ఉన్నాయి. విశాఖకు 2010 సంవత్సరం తర్వాత పెద్ద ఐటి యూనిట్‌ (కంపెనీ) రాకపోవడంతో ఐటి ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ జరగడం లేదని ఐటి ఆంధ్రప్రదేశ్‌ (ఐటాప్‌) ప్రతినిధులు చెబుతున్నారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఐటి హిల్‌ నెం.3లోని మిలీనియం టవర్స్‌ (కాండ్యుయెంట్‌)లో కాస్త కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే 2022లో ఇన్ఫోసిస్‌ సంస్థ విశాఖకు వచ్చేస్తుందని జగన్‌, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రచారం చేశారు. విశాఖలో ఇన్ఫోసిస్‌ కోసం భవనం తీసుకున్నారు. కానీ ఐటి కార్యకలాపాలు మాత్రం ప్రారంభం కాలేదు. ఇన్ఫోసిస్‌ వస్తే ఐదు వేల ఐటి ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ జరిగి ఉండేది. అమెజాన్‌ సంస్థ కార్యకలాపాల మొదటి పేజి తరువాయి
కోసం సిరిపురం జంక్షన్‌లో ఒక అద్దె భవనం తీసుకున్నారు. కార్యకలాపాలు జరగడం లేదు. తాజాగా అదానీ డేటా సెంటర్‌ కోసం (గతంలో చంద్రబాబు హయాంలోనూ శంకుస్థాపన జరిగింది) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పునాదిరాయి వేశారు. అదానీ డేటా సెంటర్‌ వస్తే ఇదే పెద్ద యూనిట్‌ కానుంది.
భోగాపురం ఎయిర్‌పోర్టు వద్ద ఐటి సెజ్‌ అంతే సంగతి?
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 2019లో భోగాపురం ఎయిర్‌ పోర్టు పక్కన ఐటి సెజ్‌ వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. విశాఖలో ఇప్పటికే గంభీరంలో ఉన్న ఐఐఎం మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం ఎయిర్‌పోర్టుకు కావాల్సిన 2200 ఎకరాలు కాకుండా అదనంగా 500 ఎకరాలనూ గుర్తించారు. తాజాగా ఇక్కడ ఐటి సెజ్‌ కాకుండా రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. హిల్‌ నెం.3లోని కాండ్యుయెంట్‌ ఐటి యాజమాన్యం 2019-2020లలో పశ్చిమబెంగాల్‌, ఒడిశా, బెంగళూరు, చెన్నై నుంచి ఐటి ఉద్యోగులను తెచ్చుకుని ప్రత్యేకంగా కాండ్యుయెంట్‌ బస్సులు వేసి పనిచేయించింది. స్థానికంగా కొంతమంది ఐటి కంపెనీల ప్రతినిధులు కాండ్యుయెంట్‌పై తిరగబడ్డారు. ఎందుకంటే ఐటి ఉద్యోగులుగా వీరిని తీసుకుంటే రూ.8 వేలు జీతనం ఇస్తారు. కాండ్యుయెంట్‌ రూ.30 వేల వరకూ ఇచ్చేవారు... ఇప్పుడు రూ.60 వేల వరకు వేతనాలు కాండ్యుయెంట్‌ కొద్ది మందికి ఇస్తోంది.

  • తప్పనిసరై చేస్తున్నాం...

పలువురు ఐటి ఉద్యోగులను ప్రజాశక్తి బుధవారం పలుకరించి జీతాల గురించి మాట్లాడగా పెరగని జీతాలతో అత్యధిక మంది కూలీలుగా ఉన్నామంటూ కాండ్యుయెంట్‌ ఐటి వద్ద వాపోయారు. ఇదే కొనసాగితే ఏ పనీ చేయలేక, దీంట్లో కొనసాగలేక అవస్థలు పడాల్సి ఉంటుందని తెలిపారు. తప్పనిసరై చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.