సుప్రీంకోర్టు ఆదేశాల్లో భాగంగా నియామకం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన సమాచార కమిషనరు (సిఐసి)గా హీరాలాల్ సమరియా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజా నియామకంతో సిఐసిగా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్ సమారియా నిలిచారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సిఐసి), స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లలో (ఎస్‌ఐసిలు) ఖాళీలను భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజా నియామకం జరిగింది. ఖాళీలు భర్తీ చేయని పక్షంలో ఆర్‌టిఐ చట్టం-2005కు జీవం లేనట్టేనని సిజెఐ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.