May 22,2023 12:22

భువనేశ్వర్‌  :  ఒడిశా మాజీ స్పీకర్‌ బిక్రమ్‌ కేశరి అరుఖా సహా ముగ్గురు కొత్త మంత్రులను నవీన్‌ పట్నాయక్‌ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అరుఖ్‌తో పాటు బిజెడి సీనియర్‌ ఎమ్మెల్యేలు శారదా ప్రసాద్‌ నాయక్‌, సుదామ్‌ మరాండిలతో రాష్ట్ర గవర్నర్‌ గణేశి లాల్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సమక్షంలో భువనేశ్వర్‌లోని లోక్‌ సేవా భవన్‌లోని కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది జరగనున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ మంత్రి మండలి పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టడం గమనార్హం. ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నవీన్‌ పట్నాయక్‌కు ఇది రెండో మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ.

ఒడిశా స్పీకర్‌ బిక్రమ్‌ కేశరి అరుఖా సహా ఇద్దరు మంత్రులు వ్యక్తిగత కారణాలతో ఈ నెల ప్రారంభంలో తమ పదవులకు రాజీనామా చేయడంతో శాఖల మార్పు తప్పనిసరైంది. ఈ ఏడాది జనవరిలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నబా కిషోర్‌ దాస్‌ హత్యకు గురవడంతో ఆ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. స్పీకర్‌ తన రాజీనామాను పంపిన వెంటనే, ఇద్దరు కేబినెట్‌ మంత్రులు సమీర్‌ రంజన్‌ దాస్‌, శ్రీకాంత్‌ సాహులు కూడా రాజీనామా చేశారు. సమీర్‌ రంజన్‌ దాస్‌ విద్యాశాఖ మంత్రిగా ఉండగా, శ్రీకాంత్‌ సాహూ కార్మిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు.