భువనేశ్వర్ : ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహితుడు, వ్యక్తిగత కార్యదర్శి వి.కె. పాండియన్‌కి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మంత్రి హోదాని కట్టబెట్టింది. పాండియన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 5టి ( ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్షియేటివ్స్ ) మరియు నవీన్ ఒడిసా స్కీమ్ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఒడిసా జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ డిపార్ట్‌మెంట్ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆయన కేబినెట్ మంత్రి హోదాలో ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న పాండియన్ ఇటీవల తన పదవికి స్వచ్ఛందంగా విరమణ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థన వచ్చిన రెండు రోజుల అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పాండియన్ పార్టీలో చేరవచ్చని, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనకు పార్టీలో పెద్దపీట వేయవచ్చని బిజెడి వర్గాలు గతంలోనే ప్రకటించాయి.
ఒడిసా కేడర్ 2000 బ్యాచ్‌కి చెందిన ఐఎఎస్ అధికారి పాండియన్ .. 2002లో ధర్మఘర్ సబ్ కలెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2005లో మయూర్ భంజ్ కలెక్టర్‌గా, 2007లో గంజామ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సన్నిహితులయ్యారు. 2011లో నవీన్ పట్నాయక్ కార్యాలయంలో చేరారు. అనంతరం ప్రైవేట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను ప్రైవేట్ సెక్రటరీగా నియమించడంపై బిజెడి ప్రత్యర్థుల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. సెక్రటరీ పదవిని దుర్వినియోగం చేశారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.