Sep 03,2023 12:23

భువనేశ్వర్‌ :   ఒడిశాలో భారీ వర్షాలు, పిడుగులు భీభత్సం సృష్టించాయి. శనివారం పిడుగులు పడి 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు.   ఖుర్దా జిల్లాలో నలుగురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే బోలన్‌గిర్‌లో ఇద్దరు, అంగుల్‌, బౌద్‌, జగత్‌సింగ్‌పూర్‌, దేన్‌కనాల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. ఒడిశా తీర ప్రాంతంతో పాటు జంట నగరాలైన భువనేశ్వర్‌, కటక్‌ పట్టణాల్లో మెరుపులతో భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.

రాబోయే నాలుగు రోజుల పాటు ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. తుఫానుతో పాటు రుతుపవనాలు కూడా తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.భువనేశ్వర్‌లో అత్యధికంగా 126 మి.మీ. వర్షపాతం నమోదైంది. కటక్‌లో 95.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం అలాగే సెప్టెంబర్‌ 3 నాటికి ఉత్తర బంగాళా ఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ హెచ్‌.ఆర్‌. బిశ్వాస్‌ తెలిపారు. దీంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.