Nov 08,2023 16:35

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఆ ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్‌ ఉంది.
11వ తేదీ నుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండనున్నట్లు పేర్కొంది. సీజన్స్‌ లెట్‌ అక్టోబర్‌లో పడాల్సిన వర్షం నవంబర్‌లో పడుతోందని వాతావరణ శాఖ చెప్పింది. నవంబర్‌ మూడో వారం నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరగనున్నట్లు హెచ్చరించింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే రెండు రోజులు రోజులు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, నారాయణ పేట, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. మేడ్చల్‌ మల్కాజిగిరి, వరంగల్‌, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్‌గా పడిపోతాయన్నారు. హైదరాబాద్‌ సహా పొరుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు.