Jul 21,2023 10:03
  • వలంటీర్లు ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోరు : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకె మీనా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రతి వారమూ రాజకీయ పార్టీలకు నియోజకవర్గ స్థాయిలో సమాచారం అందిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. లోపాలు లేని ఓటర్ల తుది జాబితా కోసం ఈ అవకాశాన్ని రాజకీయ పక్షాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం సచివాలయంలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పక్షాలతో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్‌కుమార్‌ మీనా ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారం, బిఎల్‌ఒల పాత్ర, ఇఆర్‌ఒలు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి జారీ చేసిన ఏకీకృత సూచనలను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొచ్చారు. ఇఆర్‌ఒలు ప్రతి వారమూ క్లెయిమ్‌లు, అభ్యంతరాల జాబితాను నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పార్టీలకు అందిస్తారని, దానినే సిఇఒ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. తొలుత ప్రత్యేక ఓటర్ల సవరణ షెడ్యూల్‌ను వివరించిన మీనా, 2024 జనవరి 1 అర్హత తేదీగా నిర్ధారించామని, జులై 21 నుంచి బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల ద్వారా ఇంటింటి వెరిఫికేషన్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇంటింటి సర్వే సమయంలో బిఎల్‌ఒ యాప్‌లో సమాచారాన్ని అప్‌డేట్‌ చేస్తారన్నారు. ఇంటింటి సర్వే సమయంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లు బిఎల్‌ఒలతో కలిసి వెళ్లొచ్చన్నారు. ఇంటింటి సందర్శనల షెడ్యూల్‌ను జిల్లా స్థాయిలోని రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు. బిఎల్‌ఒలు జులై 21న ఇప్పటికే ఉన్న సమాచారాన్ని అధికారికంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో పంచుకుంటారని, ఇంటింటి ధ్రువీకరణ పూర్తయిన తర్వాత, పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ జరుగుతుందన్నారు. పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే రాజకీయ పార్టీలు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావచ్చని, వారు పోలింగ్‌ స్టేషన్ల ప్రతిపాదనలను సిఇఒకు పంపుతారని ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు. అక్టోబరు 17న ఇంటిగ్రేటెడ్‌ డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ ప్రచురించి, వాటిపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు నవంబరు 30 వరకు స్వీకరిస్తారన్నారు. ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. బిఎల్‌ఒ పరిశీలన సమయంలో వలంటీర్లను దూరం పెట్టాలని టిడిపి కోరగా, ఇందుకు సంబంధించి ఇప్పటికే వలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా వినియోగించరాదనే మార్గదర్శకాలు ఉన్నాయని మీనా తెలిపారు. బిఎల్‌ఒలుగా తాత్కాలిక ఉద్యోగులను నియమించరాదని కాంగ్రెస్‌ పార్టీ కోరగా, ఎన్నికల సంఘం నిబంధనావళి మేరకు శాశ్వత ఉద్యోగులనే నియమించామన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుగులో అందించాలని సిపిఎం కోరింది. ఈ సమావేశంలో వైసిపి నుంచి మూర్తి, టిడిపి నుంచి వర్ల రామయ్య, కోనేరు సురేష్‌, సిపిఎం నుంచి వై వెంకటేశ్వరరావు, జె జయరామ్‌, బిజెపి నుంచి వి హేమంత్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి వి గురునాథం, వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.