Oct 31,2023 10:31

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లో రెండు సిట్టింగ్‌ స్థానాలతో సహా 17 స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సిపిఎం 17 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. హనుమాన్‌గఢ్‌ జిల్లాలోని భద్ర సిట్టింగ్‌ స్థానం నుంచి బల్వాన్‌ పునియా మళ్లీ పోటీ చేయనున్నారు. బికనీర్‌లోని మరో సిట్టింగ్‌ స్థానమైన దుంగార్‌ఘర్‌లో గిర్దారిలాల్‌ మహియా తిరిగి పోటీ చేయనున్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి అమ్రా రామ్‌ సికార్‌ జిల్లాలోని దాతరంగఢ్‌ నుంచి పోటీ చేయనున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అమ్రారామ్‌ 2008లో దాతరాన్‌గఢ్‌లో గెలుపొందారు. మరో మాజీ ఎమ్మెల్యే పేమారామ్‌ సికార్‌లో పోటీ చేయనున్నారు.
 

                                                  సిపిఎం పోటీ చేసిన ఇతర స్థానాల అభ్యర్థులు

లక్ష్మణ్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి విజేంద్ర ఢాకా, సికార్‌ నుంచి ఉస్మాన్‌ ఖాన్‌, హనుమాన్‌ఘర్‌ నుంచి రఘువీర్‌ వర్మ, నోహర్‌ నుంచి మంగేష్‌ చౌదరి, రైసింగ్‌ నగర్‌ నుంచి షోపేత్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌, అనుప్‌గఢ్‌ నుంచి షో సింగ్‌ ధిల్లాన్‌, దుంగార్‌పూర్‌ నుంచి గౌతమ్‌ తోమర్‌, తారానగర్‌ నుంచి నిర్మల్‌ కుమార్‌ ప్రజాపత్‌, సర్దార్‌షహర్‌ నుంచి ఛగన్‌లాల్‌ చౌదరి, సదుల్‌పూర్‌ నుంచి సునీల్‌ పునియా, జాదౌల్‌ నుంచి ప్రేమ్‌ పార్గి, లద్నూ నుంచి భగీరథ్‌ యాదవ్‌, నవన్‌ నుంచి కనరామ్‌ బిజరానియా పోటీ చేయనున్నారు.
సికార్‌ జిల్లాలో నలుగురు, హనుమాన్‌గఢ్‌, చురు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీగంగానగర్‌, నాగౌర్‌లో ఇద్దరు చొప్పున, దుంగార్‌పూర్‌, బికనీర్‌, ఉదరుపూర్‌ జిల్లాల్లో ఒక్కో స్థానానికి సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
 

                                              బిజెపికి ధీటుగా సిపిఎం నిలబడుతుంది : అమ్రారామ్‌

సిపిఎం రాజస్థాన్‌ రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌ మాట్లాడుతూ.. పోటీ లేని నియోజకవర్గాల్లో బిజెపికి ధీటుగా సిపిఎం నిలబడుతుందన్నారు. రాజస్థాన్‌లో బిజెపికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడేందుకు కాంగ్రెస్‌ విముఖత చూపిందని మీడియా అడిగిన ప్రశ్నకు అమ్రారామ్‌ సమాధానం ఇచ్చారు. 'సీట్ల విషయంలో కాంగ్రెస్‌ అధి ష్టానం అంగీకరించలేదు. సిపిఎంకు గరిష్టం గా మూడు సీట్లు ఇవ్వవచ్చని కాంగ్రెస్‌ రాజస్థాన్‌ ఇన్‌ఛార్జ్‌ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా అన్నారు. ప్రస్తుతం సిపిఎంకు రెండు స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రెండు చోట్ల రెండో స్థానంలో నిలిచాం. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో దాదాపు 45 వేల ఓట్లు ఉన్నాయి. బిజెపిపై పోరుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేని పరిస్థితుల్లో సిపిఎం 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను బట్టబయలు చేసేందుకు, ప్రజా సమస్యలను సభకు తీసుకురావడానికి సిపిఎం అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించాలి' అని అమ్రారామ్‌ అభ్యర్థించారు.