న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, కేరళలోని పూతుపల్లి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఝార్ఖండ్‌లోని దుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, ధాన్‌పుర్ శాసనసభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ ఏడు స్థానాల ఉప ఎన్నిక ఫలితాలను సెప్టెంబరు 8వ తేదీన ప్రకటించనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ నియోజకవర్గంలో సమాజ్ వాది పార్టీ (ఎస్‌పి) నుండి ప్రతిపక్ష కూటమి మద్దతుతో సుధాకర్ సింగ్ బరిలో దిగగా, బిజెపి నుండి దరా సింగ్ చౌహన్ పోటీ పడుతున్నారు. ఇటీవల దరాసింగ్ చౌహాన్ సమాజ్‌వాది పార్టీ నుండి బిజెపిలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ సారి బిజెపి నుండి దరాసింగ్ పోటీలో దిగగా, సుధాకర్ సింగ్‌ను ఎస్‌పి బరిలోకి దింపింది. ఘోసీలో నియోజకవర్గంలో మొత్తం పది మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ముఖ్యంగా బిజెపి, 'ఇండియా' కూటమి మధ్య ద్విముఖ పోరు నెలకొంది. 28 ప్రతిపక్ష పార్టీల కూటమి 'ఇండియా'కి ఈ ఉప ఎన్నిక కీలక పరీక్ష కానుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా కూటమికి ఇవి మొదటి ఎన్నికలు కానున్నాయి.
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మరణంతో పూతుపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి 53 ఏళ్ల పాటు చాందీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ నుండి ఊమెన్ కుమారుడు చాందీ ఊమెన్ పోటీ పడుతున్నారు. సిపిఎం నుండి జైక్ సీ థామస్ పోటీ పడుతున్నారు.
ఝార్ఖండ్‌లోని దుమ్రి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి, జెఎంఎం నేత జగన్నాథ్ మహతో మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇండియా కూటమి తరఫున జగన్నాథ్ మహతో సతీమణి బేబి దేవి బరిలో ఉండగా.. ఎన్‌డిఎ నుండి యశోదా దేవి పోటీ చేస్తున్నారు.
త్రిపురలో ధాన్‌పుర్, బోక్సానగర్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా సిపిఎం, బిజెపిల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ సిపిఎంకు మద్దతుగా కాంగ్రెస్, తిప్రా మోథా పార్టీలు అభ్యర్థులను నిలబెట్టలేదు.
ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి లమధ్య గట్టి పోటీ నెలకొంది.
పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్-వామపక్ష కూటమి, బిజెపిల మధ్య ప్రధానంగా పోటీ ఉంది.