ప్రజాశక్తి- విజయవాడ :కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ, కరోనా విస్తరణకు కారణమయ్యారంటూ సిపిఎం నేతలపై పెట్టిన అక్రమ కేసును శుక్రవారం విజయవాడ కోర్టు కొట్టివేసింది. 2020లో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలోని పేదలకు సిపిఎం, ప్రజా సంఘాల నేతలు దాతల సహకారంతో పలు రోజులపాటు భోజన ఏర్పాట్లు చేశారు. కరోనాలో ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా విస్తరించకుండా ప్రజలను చైతన్యపరిచారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, కరోనా విస్తరణకు కారణమయ్యారంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, విజయవాడ సెంట్రల్ సిటీ కార్యదర్శి బి.రమణరావు, స్థానిక నేతలు టి.శ్రీనివాస్, దమ్మాసి రమణ, డివైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌కె.నిజాముద్దీన్, సిఐటియు నాయకులు ఎంవి.రమణపై ఐపిసి సెక్షన్ 341, 143, 188, 268, 269, 270, సెక్షన్ 3-ఎపెడమిక్ డిసిజెస్ యాక్ట్ కింద పోలీసులు కేసులు పెట్టారు. అప్పటి నుండి ఈ కేసుపై విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో సిపిఎం నేతల తరపున ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్, ఎస్.రమేష్ వాదించారు. న్యాయ సహకారం అందించిన న్యాయవాదులకు సిపిఎం, ప్రజా సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.