Oct 12,2023 09:47
  • గోపీచంద్‌ అకాడమీలో సౌకర్యాలు భేష్‌..

హైదరాబాద్‌: మహిళా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో మరో ఐదేళ్లు ప్లేయర్స్‌ వెలుగులోకి రావడం కష్టమేనన్నారు. తనకు, పివి సింధుకు ఆకాశానికి, భూమికి మధ్య ఉన్న వ్యత్యాసం ఉందని, పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు బ్యాడ్మింటన్‌ విభాగంలో మూడు పతకాలు దక్కాయని, అవన్నీ పురుషుల విభాగంలో దక్కాయి కానీ.. మహిళల కేటగిరీలో ఒక్క పతకం దక్కకపోవడానికి ఇదే నిదర్శనమని ఆమె తెలిపారు. తాను ఒకప్పుడు సింగిల్స్‌ విభాగంలో నంబర్‌వన్‌గా వెలుగొందానని, ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించగలిగానని తెలిపారు. అలాగే పివి సింధు ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకం సాధించిందని, అలాగే సింగిల్స్‌లో చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకొని టాప్‌-2 చేరుకోగలిగిందని కొనియాడారు. ఆ తర్వాత సింధు ఫామ్‌ కోల్పోవడం, తాను గాయాలబారిన పడి ఫామ్‌ కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సైనా నెహ్వాల్‌ భర్త పారుపల్లి కశ్యప్‌, సలహాదారు గురుసాయిదత్‌, మాజీ అంతర్జాతీయ క్రీడాకారులు విజరు లాన్సే, అనుప్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.