Jan 13,2021 11:15

బ్యాంకాక్‌ : స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌కి చేదు అనుభవం ఎదురైంది. కరోనా వైరస్‌ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో నిర్వాహకుల దురుసు ప్రవర్తన కారణంగా అతని ముక్కుకు గాయమైంది. ముక్కులో నుంచి రక్తం కారింది. రక్తం కారుతున్న ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన శ్రీకాంత్‌.. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నిర్వాహకుల తీరుపై విమర్శలు గుప్పించాడు. తనతో వారు వ్యవహరించిన తీరు ఏమాత్రం బాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టోర్నీకి ముందే తాను నాలుగు సార్లు వైరస్‌ పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పాడు.

కాగా, కరోనా కారణంగా దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలి బ్యాడ్మింటన్‌ టోర్నీ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-1000 టోర్నమెంట్‌ మంగళవారం ప్రారంభం అయింది. అయితే టోర్నీ మొదటి రోజే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వార్తలు రాగా.. అవన్నీ అవాస్తవమని తాజాగా తెలిసింది. దీంతో బుధవారం తమ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఇద్దరికీ లైన్‌ క్లియర్‌ అయింది.