Jan 31,2021 23:53

మాట్లాడుతున్న సిఐటియు నాయకులు ముజఫర్‌ అహ్మద్‌

సిఐటియు రాష్ట్ర నాయకులు ముజఫర్‌ అహ్మద్‌
ప్రజాశక్తి - తాడేపల్లి : సిఐటియు లాంటి కార్మిక ట్రేడ్‌ యూనియన్‌ కార్యాలయాలు కార్మిక హక్కుల పరిరక్షణా కేంద్రాలుగా ఉపయోగపడాలని సిఐటియు రాష్ట్ర నాయకులు ముజఫర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని సుందరయ్యనగర్‌ రామచంద్రరావు కొట్టు సమీపంలో ఆదివారం సిఐటియు కార్యాలయానికి రైతు సంఘం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి జొన్నా శివశంకరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముజఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ కార్మికులు తమ హక్కులు సాధించుకోవాలన్నా, సాధించుకున్న హక్కుల పరిరక్షణకు కార్యాలయం అవసరమని పేర్కొన్నారు. సుందరయ్యనగర్‌లో వేలాదిమందిగా ఉన్న అసంఘటితరంగ కార్మికులకు అండగా నిర్మించబోయే కార్యాలయం ఉంటుందని ఆకాంక్షించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు వారి కుటుంబాల్లో వస్తున్న సమస్యలను కూడా పరిష్కారవేదికగా ఈ కార్యాలయం విరాజిల్లాలని ఆకాంక్షించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను దూకుడుగా అమలుచేస్తుందని విమర్శించారు. సంఘటిత ఉద్యమాల ద్వారానే కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెనక్కు కొట్టగలమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న పోరాటం దేశ సరిహద్దులను దాటి ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. స్వాతంత్య్ర పోరాటం అనంతరం ఇంత పెద్దఎత్తున సామాన్య ప్రజానీకం, రైతులు, కార్మికులు భాగస్వామ్యులైన పోరాటం ఇదేనని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బూరగ వెంకటేశ్వర్లు, వేముల దుర్గారావు, బ్రహ్మయ్య, సీతారామయ్య, నారిన నాగేశ్వరరావు, సిహెచ్‌. భుజంగరావు, శ్రీరామచంద్రరావు, కె.ఉషారాణి, పి.గిరిజ, కొట్టే కరుణాకరరావు, ఆర్‌వి.రాఘవయ్య, రూబెన్‌, పెద్దబుడే పాల్గొన్నారు.