సేద్యపు రంగంలో శరవేగపు కార్పొరేటీకరణే ఆ రంగంలో నెలకొన్న సంక్షోభానికి పరిష్కారమంటూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం తప్పుడు ప్రచారం లంకించుకున్న వేళ అసలు సిసలు ప్రత్యామ్నాయం కో-ఆపరేటీకరణేనని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) చేసిన సవాల్ రైతాంగాన్ని ఆలోచింపజేస్తోంది. వ్యవసాయంలో కార్పొరేటీకరణను కొత్త పుంతలు తొక్కించే చట్టాలను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా రైతాంగ ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. మరికొన్ని ఎన్‌డిఎ యేతర రాష్ట్రాలు ఆ దిశగా కదులుతున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో బిజెపి వల్లించే కార్పొరేటు మంత్రం నిజంగానే రైతులను రక్షిస్తుందా? దానికి ప్రత్యామ్నాయం లేదా? అనే ప్రశ్నలు రైతులను గందరగోళ పరుస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో ఎఐకెఎస్ సహకార ప్రత్యామ్నాయాన్ని ఎజెండా మీదికి తెచ్చి చర్చనీయాంశం చేయడం నిరాశా నిస్ప్రుహల్లో కొట్టుమిట్టాడుతున్న రైతులకు మార్గం చూపించింది. నయా-ఉదార విధానాల పరాకాష్టలో సహకార విధానానికి మన పాలకులు పాతరేయగా, కార్పొరేట్ కాదు కో-ఆపరేటివ్ కావాలని ఎలుగెత్తి ఒక వైపు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ మరో వైపు రైతులను సహకార దిశగా సంఘటితం కావాలని పిలుపునివ్వడం మంచి పరిణామం.
వాస్తవానికి సహకార విధానం మనకు కొత్తమీ కాదు. దేశంలో స్వాతంత్య్రోద్యమంతో పాటే సహకారోద్యమం జమిలిగా కొనసాగిందన్నది చరిత్ర. స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాల పాటు సహకార వ్యవస్థ వికసించింది. ఎప్పుడైతే 1991లో నూతన ఆర్థిక విధానాలు దేశంలో ప్రవేశపెట్టబడ్డాయో ఆ లగాయతు ప్రభుత్వాలు కో-ఆపరేటివ్‌లను నిర్వీర్యం చేశాయి. సహకార స్ఫూర్తికి గండి కొట్టాయి. వామపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో సహకార వ్యవస్థ బలోపేతం అయింది. యుపిఎ హయాంలో వ్యవసాయ రంగ కార్పొరేటీకరణ లక్ష్యంతో రైతు ఉత్పత్తిదారు సంఘాల (ఎఫ్‌పిఒ) కాన్సెప్టు పురుడు పోసుకుంది. మోడీ ప్రభుత్వం పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం, సేంద్రీయ వ్యవసాయం పేర్లతో దూసుకు వచ్చింది. ఎఫ్‌పిఒ విధానం పైకి రైతుల సమిష్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్లు కనిపించినా రైతులను కార్పొరేట్ల చెప్పుచేతల్లో పెట్టేది. రైతులతో కుదుర్చుకునే ఒప్పందాలకు సహకార చట్టాలు అడ్డంగా ఉన్నాయి కనుక కంపెనీల చట్టం కింద రైతు సంఘాలు ఏర్పడేందుకు ఎఫ్‌పిఒ కాన్సెప్టు తయారైంది. దీనిలో రైతులకు ఎలాంటి అధికారాలూ ఉండవు. కంపెనీలు కోరిన పంటలు పండించాలి. వాటికే, అవి నిర్ణయించిన ధరకే అమ్మాలి. సదరు కంపెనీల ఉత్పాదకాలే వాడాలి. యంత్రాలనే వినియోగించాలి. ఇది రైతులకు దాపురించిన ఆధునిక వెట్టి.
సహకార విధానం పూర్తి భిన్నం. రైతులకే సర్వాధికారాలు వుంటాయి. తాము ఏ పంటలు పండించాలో ఎవరికి అమ్మాలో నిర్ణయించుకునేది రైతు సంఘాలే. ఎకరం రెండెకరాల కమతాలు అధికంగా ఉన్న మన దేశంలో సహకార విధానంలో సమిష్టి వ్యవసాయం నమూనా అత్యుత్తమమైనది. పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వసతులు ఇవన్నీ సమకూర్చుకోవడం అసంఘటితంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఇబ్బంది. సహకార వ్యవసాయంలో ఆ ఇబ్బందులను రైతులు అధిగమించవచ్చు. ఎల్‌డిఎఫ్ అధికారంలో ఉన్న కేరళలో ఒక్క వ్యవసాయమే కాదు ఆరోగ్యం, ఇత్యాది విషయాల్లోనూ కో-ఆపరేటివ్‌లు పటిష్టంగా పని చేస్తున్నాయి. వరికి కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కంటే అధిక ధర కేరళలో సమర్ధవంతంగా అమలవుతుందన్నా, తాజాగా ఎక్కడా లేని విధంగా 16 రకాల పండ్లు, కూరగాయలకు ఎంఎస్‌పి ప్రకటించినా కో-ఆపరేటివ్‌ల దన్నుతోనే. కానీ మోడీ సర్కారు ప్రభుత్వ రంగంలోని కో-ఆపరేటివ్‌లను అమ్మడమో, మూసేయడమో చేస్తోంది. కేంద్రం తెచ్చిన స్వేచ్ఛా మార్కెట్ చట్టాలు కార్పొరేట్లకు అపరిమిత స్వేచ్ఛ కల్పిస్తాయి. భూసంస్కరణలకు బదులు కార్పొరేట్ల కేంద్రంగా భూమి కేంద్రీకృతం అవుతుంది. ఆధునిక భూస్వాములుగా కార్పొరేట్లు రూపాంతరం చెందుతారు. కార్పొరేట్లకు రైతులు కట్టు బానిసలుగా మారతారు. కొనుగోలుదారులైన కార్పొరేట్లంతా కూడబలుక్కుని మార్కెట్‌పై పట్టు బిగించే ప్రయత్నానికి విరుగుడుగా ఉత్పత్తిదారులైన రైతులందరినీ సంఘటితం చేసే సహకార వ్యవస్థను బలోపేతం చేసుకోడానికి రైతన్నలు కదలాల్సిన తరుణం వచ్చింది.










