Jun 19,2023 16:38

ప్రజాశక్తి-కాకినాడ : రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో విలీనం చేయడాన్ని  అపాలని, జీవో నెంబర్ 36 ప్రకారం పెరిగిన వేతనాలు 2019 నుంచి అమలు చేయాలని, జగన్ ప్రభుత్వం సహకార రంగంలో 50శాతం షేర్లు ప్రైవేటు యాజమాన్యాలకి ఇవ్వాలని చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని, సహకార రంగా ఉద్యోగుల గ్రాడ్యుటి పది లక్షలకు పెంచాలని, ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించి, సహకార పరపతి సంఘాలను ఇన్ కమ్ టాక్స్ నుండి మినహాయించాలని కోరుతూ జిల్లా డిసిసిబి కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించి జనరల్ మేనేజర్ పి.ప్రవీణ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్యన్నారాయణ, రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యన్నారాయణ, సంఘం జిల్లా అధ్యక్షులు కె. ఆదినారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నరసరాజు, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు దువ్వ శేషాబాబ్జి, చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు రుణాలు అందించడంలో, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం సేకరించడంలో సహకార రంగ ఉద్యోగుల పాత్ర కీలకమని, జగన్ ప్రభుత్వం సహకార రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా రాష్ట్ర రైతాంగానికి, సహకార రంగ ఉద్యోగులకు తీవ్ర నష్టం చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో రైతుల రుణమాఫీ చేసే అవకాశం లేకుండా ప్రైవేటీకరణ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకార రంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలు చేస్తుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు అందుకు మద్దతు తెలపడం రాష్ట్ర రైతాంగం చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. బిజెపి విధానాలకు రాష్ట్రంలో మద్దతు తెలిపే వారిని ఓడించి సహకార రంగాన్ని కాపాడుకోవాలని రైతులకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సహకార రంగం ప్రైవేటీకరణ అయితే రైతుల రుణాలను రౌడీలను పెట్టి వసూలు చేసే పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు. 2019లో జారీ చేసిన ఉద్యోగుల వేతన సవరణ జీవో 36 ను వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాలనా కాలంలో అమలు చేయకపోవడాన్ని ఉద్యోగులు గుర్తుపెట్టుకొని ఎన్నికల్లో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా నాయకులు పి.తంబయ్య, అప్పలరాజు, కొలంక రాము, సత్యానందం, చిట్టియ్య, కొండబాబు, శివనాగ, పి.సాయిబాబు, పి.సుబ్బారావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి రమణమ్మ, సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు మెడిశెట్టి వెంకటరమణ పాల్గొని మద్దతు తెలియజేసారు.